విదేశీ పెట్టుబడిదారులకు మోకరిల్లుతున్న మోడీ
ఇఫ్టూ జాతీయ అధ్యక్షుడు కృష్ణ
భీమ్‌గల్ : ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పెట్టుబడిదారుల ముందు మోకరిల్లుతున్నారని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు డీవీ కృష్ణ అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. జాతీయవాదం అంటూనే విదేశాల్లో పెట్టుబడిదారులకు గేట్లు బార్లా తెరిచారని ఆక్షేపించారు. దేశం ప్రస్తుతం వ్యవసాయ సంక్షోభం ఎదుర్కుంటోందన్నారు. ఆర్థిక మాంద్యం పెరిగి, రూపాయి విలువ తరిగి, స్టాక్‌మార్కెట్ కుప్ప కూలి పోతోందన్నారు.
బీడీ, తేయాకు, జనపనారలాంటి పెద్దపెద్ద పరిశ్రమలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లోనే రైతులు, కార్మికులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో ఉత్పత్తి చేసిన సరుకులను విదేశాలలోమార్కెట్ చేసుకొమ్మని మోడీ చెబుతున్నారని, దీనితో పారిశ్రామిక రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. ఈ సదస్సులో ఏఐకేఎంఎస్ రాష్ర్ట కార్యదర్శి వి.ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు బి.దేవారం, నాయకులు కె.రామ కృష్ణ, కె.రాజేశ్వర్, ముత్తెన్న, బాబాన్న తదితరులు మాట్లాడారు.
నియామకపత్రాల అందజేత
ఇందూరు : తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మీనాకుమారి, జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఎన్నికైన జగదీశ్‌లకు శనివారం నియామక పత్రాలను అందించారు. ఈ విషయమై సంఘం జిల్లా అధ్యక్షుడు రేవంత్ ఓ ప్రకటన విడుదల చేశారు.