'వాడికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి'
ట్విన్ టవర్స్ కూల్చివేత తరువాత అమెరికా గడ్డపై అతిపెద్ద విధ్వంసంగా భావిస్తోన్న బోస్టన్ మారథాన్ పేలుళ్ల కేసులో దోషి, 21 ఏళ్ల ద్జోఖర్ త్సర్నేవ్కు ఫెడరల్ కోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించిన జ్యూరీ.. దోషికి ప్రాణాంతక ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని అధికారులను ఆదేశించింది.
2013, ఏప్రిల్ 15న బోస్టన్ నగరంలో మారథాన్ ముగింపు వరుస వద్ద రెండు శక్తిమంతమైన ప్రెషర్ బాంబులు పేలడంతో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు మరణించగా, 264 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది కాళ్లు, చేతులు కోల్పోయారు. కర్గిజ్స్థాన్కు చెందిన ద్జోఖర్, అతని సోదరుడు కలిసి ఈ దురాగతానికి ఒడిగట్టారు. మాసాచూసెట్స్ యూనివర్సిటీ విద్యార్థులైన ఈ అన్నదమ్ములు ఇస్లామిక్ దేశాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా బోస్టన్ మారథాన్లో పేలుళ్లకు పాల్పడ్డారు.
ఘటన జరిగిన మూడురోజుల తర్వాత త్సెర్నేవ్ను సజీవంగా పట్టుకున్న పోలీసులు అని సోదరుణ్ని మాత్రం కాల్చి చంపారు. రెండేళ్లకుపైగా విచారణ సాగింది. శుక్రవారం నాటి తుది తీర్పుతో బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. తమవారిని శాశ్వత వికలాంగులుగా మార్చిన దోషికి సరైన శిక్షే పడిందని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.