కోల్ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకులను ఈ-ఆక్షన్ ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలన్న నిర్ణయంతో రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. అవకతవకల అభియోగాలతో 1993 నుంచి జరిగిన 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ప్రైవేటు కంపెనీల వినియోగం కోసం సదరు కంపెనీలకు ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు గనులను కేటాయించేందుకు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వరంగ సంస్థలకు నేరుగా కేటాయింపులు జరిపేందుకు వీలుగా రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌ను విద్యుత్ సంస్కరణల్లో ప్రభుత్వం వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.
కాగా, వాణిజ్య ప్రాతిపదికన బొగ్గుగనుల తవ్వకానికి ప్రైవేటు సంస్థలకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మరోవైపు ప్రైవేటు కంపెనీలకు ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు బ్లాకులను కేటయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు సిద్ధమమతున్నాయి.