ఈ-బీట్ పోలీసింగ్
భువనగిరి : రాత్రి వేళల్లో నేరాలు అదుపు చేసేందుకు ఆధునికీకరణ దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రైమ్‌రేట్‌ను కట్టడి చేయడానికి ఎస్పీ ప్రభాకర్‌రావు ఎలక్ట్రానిక్ బీట్ పోలీస్ సిస్టమ్‌కు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌కు జీపీఎస్ విధానం కలిగిన ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. దీని ద్వారా భద్రతతోపాటు విధులు ఎగ్గొట్టే పోలీస్ బాబుల ఆటలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన లక్ష్యం. ముందుగా జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ బీట్పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
భద్రతను పటిష్టం చేయడం కోసమే..
జిల్లాలో ఇటీవల రాత్రి సమయాల్లో దొంగతనాలు, ఇతర నేరాలు వరుసగా జరుగుతుండడంతో పోలీస్ బాస్.. బీట్ కానిస్టేబుల్ వ్యవస్థపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పోలీస్‌సిబ్బంది విధుల్లో డుమ్మాలు కొడుతున్నారని గుర్తించారు. నేరాలు జరిగినప్పుడు సంఘటన స్థలానికి సకాలంలో చేరుకోకున్నా ఆక్కడే ఉన్నామంటూ తప్పుడు సమాచారం ఇచ్చే వారిని ఇది గుర్తిస్తుంది. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. పోలీసుల పనితీరు క్రమబద్ధీకరించడం కోసం దీనిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో భువనగిరి, కోదాడ డివిజన్లలోప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమయ్యారు. దీంతో జిల్లావ్యాప్తంగా అమలుచేయాలని నిర్ణయించారు.
ప్రతి స్టేషన్‌కు 2 నుంచి 5 వరకు..
జీపీఎస్ సిస్టంతో పనిచేసే సెల్ఫోన్లను జిల్లాలలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు రెండు నుంచి 5 వరకు ఇస్తున్నారు. ఇందుకోసం స్టేషన్ల వారీగా ఎన్ని ఫోన్లు కావాలని వివరాలను అడుగుతున్నారు. కొన్ని స్టేషన్లకు ఇప్పటికే వచ్చాయి. సెల్పోన్ల పంపిణీ కూడా జరుగుతోంది. ముందుగా కోదాడ, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, నకిరేకల్ ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా కోదాడ సర్కిల్లో జీపీఎస్ విధానం పైలట్ ప్రాజెక్టుగా అమలు జరుగుతోంది. గత ఎన్నికల ముందు జనవరి, ఫిబ్రవరిలో దీని పనితీరును ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా ఇది పనిచేస్తుంది.