E-bicycle
-
వారెవ్వా సామ్రాట్.. సింగిల్ చార్జ్‌తో ఈ సైకిల్ 60 కి.మీ దూరం ప్రయాణిస్తుంది!
ఆవిష్కరణలకు ‘ఉత్సాహం’ ‘ఆసక్తి’ మాత్రమే అన్ని సందర్భాలలో కారణం కాకపోవచ్చు. ‘బాధ’ ‘ఆవేదన’ కూడా కొన్ని సందర్భాలలో బలమైన కారణం కావచ్చు. ఎలా అంటే... అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన సామ్రాట్నాథ్ సాధారణ సైకిల్‌ను ‘థెఫ్ట్–ప్రూఫ్’ ఎలక్ట్రికల్ సైకిల్‌గా రూపకల్పన చేసి శబ్భాష్ అనిపించుకుంటున్నాడు. సింగిల్ చార్జ్‌తో ఈ సైకిల్ 60 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గట్టి భద్రత ఇచ్చే ఫీచర్లతో రూపొందించిన ఈ సైకిల్‌ను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నిస్తే వెంటనే మెసేజ్ స్మార్ట్‌ఫోన్‌కు చేరుతుంది. బైక్‌కు అమర్చిన అలారం అదేపనిగా మోగుతుంది. ‘ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఈ సైకిల్‌ను కంట్రోల్ చేయవచ్చు’ అంటున్న సామ్రాట్ అదనపు భద్రతలో భాగంగా ఈ సైకిల్‌కు ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను కూడా ఇన్స్టాల్ చేశాడు. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... సామ్రాట్ వాళ్లది కరీంగంజ్‌కు 55 కి.మీ దూరంలో ఉన్న అనిపూర్ అనే గ్రామం. తాను ఎనిమిదవ తరగతి చదివే రోజుల్లో, ఒకరోజు రాత్రి పూట తమ సైకిల్ దొంగతనానికి గురైంది. ఎంత ప్రయత్నించినా దాని ఆచూకి తెలియలేదు. నిజానికి తమకు అది సైకిల్ కాదు. కుటుంబంలో ఒకరు! తండ్రి ఉపాధికి చేదోడువాదోడుగా ఉండేది. సైకిల్ పోయింది అనే బాధ తనను ఎన్నోరోజుల పాటు బాధించింది. అప్పుడు అనుకున్నాడు...దొంగిలించడానికి వీలులేని ఎలక్ట్రికల్ బైసికిల్‌ను తయారుచేయాలని. ఇంటర్నెట్ ద్వారా కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఎలక్ట్రికల్ బైస్కిల్ ఎలా పనిచేస్తుంది? జీపిఎస్, ఇతర కనెక్షన్ల గురించి నేర్చుకున్నాడు. ఆ తరువాత...యాప్ తయారీపనిలోకి దిగాడు. తాను దాచుకున్న డబ్బులతో మొదట ఒక మామూలు సైకిల్ కొనుగోలు చేశాడు. ఫిట్టింగ్‌కు అవసరమైన భాగాలు కొనడానికి సెల్‌ఫోన్ రిపేర్ పనులు చేసేవాడు. జీపిఎస్ ట్రాకింగ్...మొదలైన వాటి దారా సైకిల్‌కు ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ చేశాడు. పాత ల్యాప్‌టాప్‌ల నుంచి రీసైకిల్ చేసిన లిథియం ఐయాన్ బ్యాటరీల ద్వారా పవర్ సమకూర్చాడు. సొంతంగా జీపిఎస్ సర్క్యూట్ తయారుచేశాడు. తన బైసికిల్కు ‘సామ్ ఎలక్ట్రాన్’ అని నామకరణం చేశాడు. 19 సంవత్సరాల సామ్రాట్ సిల్చార్ ఐటీఐ స్టూడెంట్. ‘ఇలాంటి మోడల్ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో లేదు’ అంటున్న సామ్రాట్ స్టార్టప్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. సామ్ ఎలక్ట్రానిక్ బైసికిల్ ద్వారా నా మీద నాకు నమ్మకం వచ్చింది. భవిష్యత్‌లో నా కొత్త ఆవిష్కరణలకు ఇది కచ్చితంగా స్ఫూర్తి ఇస్తుందంటున్నాడు సామ్రాట్. చదవండి: పేరెంటింగ్: భయం కాదు... భరోసా పెరగాలి -
కాలుష్య నివారణకు సోలార్ సైకిల్
పింప్రి, న్యూస్‌లైన్ : మానవ సేవా వికాస్ ట్రస్టు సౌరశక్తితో నడిచే సైకిల్‌కు శ్రీకారం చుట్టింది. నగర కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సైకిల్‌ను తయారు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వృద్ధులు, మహిళలు, స్కూలు విద్యార్థులు, వికలాంగులు సులువుగా ఈ సైకిల్‌పై ప్రయాణించవచ్చు. కేవలం నాలుగు గంటల ఛార్జింగ్‌తో 20 నుంచి 25 కి.మీ. దూరాన్ని ప్రయాణించవచ్చు. సౌరశక్తిపై నగర ప్రజలకు అవగాహన కలిగించేందుకు గత రెండేళ్లుగా ఈ సంస్థ సోలార్ సైకిల్‌ను తయారు చేస్తోంది. కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో 2012లో మానవ సేవా వికాస్ ట్రస్టు ఏర్పడింది. గ్రీన్ అండ్ క్లీన్ ప్రయాణం పేరిట ఈ-బైసైకిల్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సైకిల్లో 12 వోల్ట్ల శక్తిగల మూడు ఛార్జింగ్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. నాలుగు గంటల పాటు వీటిని చార్జింగ్ చేస్తే 25 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. చార్జింగ్ అయిపోతే మామూలు సైకిల్లాగానే తొక్కుకుంటూ కూడా వెళ్లవచ్చని రూపకర్తలు పేర్కొన్నారు. అయితే 35 కిలోల బరువున్న ఒక్కో సైకిల్ వెల సుమారు రూ.20 వేల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. వికలాంగుల కోసం మూడు చక్రాలతో, మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సైకిల్‌ను తయారు చేశారు. పింప్రి-చించ్వడ్లో ప్రస్తుతం 15 సైకిల్లు నడుస్తున్నాయి. ఈ-సైకిల్ ద్వారా ప్రతి రోజు సుమారు ఒక లక్ష యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ట్రస్టు అధ్యక్షులు సంతోష్ ఇంగలే తెలిపారు. ఈ సైకిల్ తయారీలో డిసిమోటర్, కంట్రోలర్, సోలార్ ఛార్జింగ్‌లు ఉన్నాయి. డిసిమోటర్ బెంగుళూరు నుంచి తీసుకురాగా, సౌరశక్తి ఛార్జింగ్ కోసం ప్యానెల్‌ను ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సైకిల్‌తో ధ్వని, వాయు కాలుష్యం జరగదు. సైకిల్ క్యారియర్, సీటు కింద బ్యాటరీని అమర్చారు. సంస్థ అధ్యక్షులు సంతోష్, ఉపాధ్యక్షులు వివేక్ కులకర్ణి, సునీల్ దేవ్‌లు సైకిల్ తయారీలో ముఖ్య పాత్ర పోషించారు.