E courts
-
SC Committee: ఈ–కోర్టుల మొబైల్ సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసు స్థితిగతులు, ఇతరత్రా పలు అంశాలు తెలుసుకోవడానికి ‘ఈ–కోర్టుల సేవల మొబైల్ యాప్‘ మాన్యువల్‌ని 14 భాషల్లో సుప్రీంకోర్టు ఈ– కమిటీ విడుదల చేసింది. సామాన్యులకి కూడా అర్థమయ్యేలా స్క్రీన్ షాట్స్‌తో సహా వివరణాత్మకంగా ఉండేలా ఆంగ్లం, తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉండేలా రూపొందించిన ఈ మాన్యువల్‌ను సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఛైర్మన్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం విడుదల చేశారు. ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, ఖాసి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, తమిళంలో ఈ మాన్యువల్ రూపొందించారు. న్యాయవాదులు, పౌరులు, న్యాయ సంస్థలు, పోలీసు, ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర సంస్థాగత న్యాయవాదుల ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు ఇప్పటికే విడుదల చేసిన ‘‘ఈ–కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్’’ ఇప్పటివరకు 57 లక్షల డౌన్లోడ్లను దాటింది. మొబైల్ యాప్‌ను, ఆంగ్ల, ప్రాంతీయ భాషల్లోని మాన్యువల్‌ను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్... ఈ–మాన్యువల్, మొబైల్ యాప్ ప్రాముఖ్యత వివరించారు. ‘‘న్యాయ రంగంలో డిజిటల్ సంస్కరణలను ప్రవేశపెట్టడంలో సుప్రీంకోర్టు ఈ–కమిటీ ముందంజలో ఉంది. గత సంవత్సరంలో లాక్డౌన్, ప్రజారోగ్య సమస్యల దృష్ట్యా కార్యాలయాలు మరియు కోర్టులను మూసివేయడం వల్ల రిమోట్‌గా పనిచేయడం, వర్చువల్ కోర్టులు, డిజిటల్ కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ కేసు నిర్వహణ, చట్టపరమైన వృత్తిని ఎలా అభ్యసిస్తారు, ఎలా నిర్వహిస్తారు అనే అంశాల్లో సమగ్రంగా మార్పులు వచ్చాయి. సాంకేతికతను వాడటం వల్ల న్యాయ ప్రక్రియ మరింత సమర్థంగా పనిచేయడానికి, అందరికీ అందుబాటులో ఉండటానికి, పర్యావరణహితంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మాన్యువల్ గురించి న్యాయ శాఖ కార్యదర్శి బారున్ మిత్రా మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఈ ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ ఉపకరిస్తాయన్నారు. ఈ–కోర్టు సేవల మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి, కేసు సంఖ్యలు, సీఎన్ఆర్ నంబర్లు, ఫైలింగ్ నంబర్లు, పార్టీ పేర్లు, ఎఫ్ఐఆర్ నంబరు, అడ్వొకేట్ వివరాలు, చట్టాలు, మొదలైన కేసుల కోసం వివిధ పౌర–కేంద్రీకృత సేవలను పొందవచ్చు. కేసు స్థితి, విచారణ జరిపే కేసుల జాబితా వంటివి సెర్చ్ చేసుకోవచ్చు. కేసు వారీగా కేసు డైరీతో సహా దాఖలు చేసి విచారణ పూర్తయ్యేవరకూ పూర్తి వివరాలు పొందొచ్చు. మొబైల్ యాప్ నుండి ఆర్డర్లు / తీర్పు, కేసు వివరాలను బదిలీ చేయడం, మధ్యంతర దరఖాస్తు స్థితిని యాక్సెస్ చేయవచ్చు. ఈ–కోర్ట్స్ సేవల మొబైల్ యాప్ ద్వారా– హైకోర్టులు మరియు జిల్లా కోర్టుల కేసు స్థితి / కేసు వివరాలు కూడా పొందవచ్చు. (చదవండి: Corona virus: వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా!) -
సిటీ పోలీస్.. ఇక పేపర్ లెస్!
సాక్షి, హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న నగర పోలీసు కమిషనరేట్ కాగిత రహితంగా మారుతోంది. అంతర్గత పరిపాలనతో పాటు పిటిషన్ల విచారణ, కేసుల దర్యాప్తుల ఉత్తరప్రత్యుత్తరాలు సైతం ఆన్లైన్లోనే సాగేలా కొత్వాల్ అంజినీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. ఈ ఇబ్బందులకు తావు లేకుండా ప్రస్తుతం కమిషనరేట్‌లో అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత అది కేసుగా మారడానికి, ఆపై దర్యాప్తు జరగడానికి, చార్జ్‌షీట్ దాఖలు కావడానికి ఆ ఫైల్ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు అనుమతుల కోసం వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది ఫైళ్ల రూపంలోనే జరుగుతుండటంతో ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టం. ఏదిఏమైనా జవాబుదారీతనం కొరవడిన కారణంగా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాలైన అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులకు సంబంధించిన ఫైళ్ల విషయంలోనే అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీకుమార్ ఈ–ఆఫీస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. డ్యాష్‌బోర్డ్ ఏర్పాటుకు నిర్ణయం.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తున్న పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. ఓ బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసే సిబ్బంది ఇంట్రానెట్‌లోని ప్రత్యేక లైన్లో పొందుపరుస్తారు. అక్కడ నుంచి ఈ పిటిషన్ ఎవరి వద్దకు వెళ్లింది? వారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎన్ని రోజులుగా, ఎక్కడ పెండింగ్‌లో ఉంది? అనే అంశాలు ఆన్లైన్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్ అధికారులకు వచ్చిన దరఖాస్తులకూ ఇదే వర్తిస్తుంది. ఈ ఇంట్రానెట్‌కు సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్/పిటిషన్ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను మానిటర్ చేయవచ్చు. ప్రస్తుతం అంతర్గతంగానే.. ప్రస్తుతం ఈ–ఆఫీస్ విధివిధానాలకు సంబంధించి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు గోషామహల్‌లోని ఈ–లెర్నింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులకు గురువారం జరగనుంది. ఆన్లైన్లో ఉండే ఈ–ఆఫీస్ పూర్తి భద్రంగా ఉండేలా, హ్యాకింగ్ బారినపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ సర్వర్లు కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సర్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు డిజిటల్ సిగ్నేచర్ కేటాయిస్తారు. ప్రాథమికంగా సిటీ పోలీసు విభాగంలోనే అమలయ్యే ఈ విధానాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇతర విభాగాలతో సంప్రదింపులకూ ఆన్లైన్ విధానాన్నే అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ–కోర్ట్స్తోనూ అనుసంధానం పోలీసుస్టేషన్లో నమోదయ్యే కేసుల దర్యాప్తులో వివిధ దశలు, పూర్తి చేయాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఇకపై కేసు డైరీ ఫైల్ అప్డేట్తోపాటు ఇవన్నీ ఆన్లైన్లోనే సాగుతాయి. ఫలితంగా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించే, ఉద్దేశపూర్వకంగా కేసుల్ని నీరుగార్చే అధికారుల్ని గుర్తించడం సాధ్యమవుతుంది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మాత్రం ప్రింట్‌ఔట్స్ తీసి పత్రాల రూపంలోనే దాఖలు చేయనున్నారు. భవిష్యత్తులో పోలీసు ఈ–ఆఫీస్‌ను న్యాయ విభాగానికి చెందిన ఈ–కోర్ట్స్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. ఇది జరిగితే అభియోగపత్రాలు సైతం ఆన్లైన్లోనే దాఖలు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. ఈ దశకు చేరుకోవాలంటే దేశవ్యాప్తంగా అమలవుతున్న సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. -
న్యాయ సేవలకు సాంకేతికత
సాక్షి, రాజమహేంద్రవరం: న్యాయసేవలకు సాంకేతిక సొబగులు అద్దుతున్నారు. ఇప్పటి వరకు కోర్టు గుమాస్తాలపై న్యాయవాదులు, న్యాయవాదులపై కక్షిదారులు సమాచారం కోసం ఆధారపడేవారు. ఇకపై ఆ సమస్య లేకుండా న్యాయశాఖ ‘ఈ కోర్ట్స్సర్వీసెస్’ ప్రవేశపెట్టింది. ‘సర్వీసెస్.ఈకోర్ట్స్.జీవోవి.ఇన్’ పేరుతో వెబ్సైట్, ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసింది. జాతీయ స్థాయిలో అన్ని కోర్టులను సాంకేతిక పరంగా ఒకే గొడుగుకు కిందకు తెచ్చారు. ఆయా న్యాయస్థానాల్లో పని చేసే న్యాయవాదులు తాము పనిచేసే న్యాయస్థాన ప్రాంతం, పేరు, జన్మించిన తేదీ, ఆధార్ నంబర్, బార్‌కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, కార్యాలయం, నివాసం చిరునామా, ఫ్యాక్స్ నంబర్ సమాచారాన్ని ఆయా న్యాయస్థానాలు సేకరించి ‘ఈకోర్ట్స్సర్వీసెస్’లో నమోదు చేస్తున్నాయి. ప్రతి న్యాయవాదికి ప్రత్యేకంగా సీఎన్ఆర్ నంబర్ కేటాయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఈ ప్రక్రియ పూర్తయింది. న్యాయవాదుల సమాచారంతోపాటు ఆయా న్యాయస్థానాల్లో వారు దాఖలు చేసిన కేసుల సమాచారం, కక్షిదారుడు, అతని ఫోన్ నంబర్, చిరునామా, ఆధార్ తదితర వివరాలతో కేసు నమోదు చేసే సమయంలో కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. కేసు నంబర్‌ను కోర్టు కేటాయిస్తుంది. ఆ కేసు నంబర్‌తో న్యాయవాదులు, కక్షిదారులు తమ ఇంటి నుంచే ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ ద్వారా తమ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? కేసు వాయిదా ఎప్పుడు? తుది విచారణ ఎప్పుడు జరుగుతుంది? ప్రతివాది ఎవరు? వారి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎవరు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. కోర్టులు జారీ చేస్తున్న నోటీసులు కూడా నేరుగా ఆయా న్యాయవాదులు, కక్షిదారులకు చేరుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. గిమ్మిక్కులకు ఇకపై చెక్... ఏదైనా ఒక కోర్టులో దాఖలు చేసిన కేసు వివరాలను దేశంలో ఎక్కడ నుంచైనా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ ఎంతగానో ఉపయోగపడుతోంది. కేసు నంబర్ ద్వారా న్యాయవాది, కక్షిదారు తమ కేసు తాజా స్థితిని ఎక్కడ నుంచైనా తెలుసుకోవచ్చు. కేసు దాఖలు చేయకుండా చేశామని, వాయిదా లేకపోయినా ఫలానా రోజున వాయిదా అంటూ కొంతమంది న్యాయవాదులు గిమ్మిక్కులు చేసి ఫీజు వసూలు చేసేవారు. అయితే ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ వల్ల ఆ గిమ్మిక్కులకు ఇక కాలం చెల్లినట్టయింది. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు కక్షిదారులు తమ కేసు విచారణ స్థితిని తెలుసుకోవచ్చు. న్యాయవాదులు తాము దాఖలు చేసిన కేసు ఎప్పుడు వాయిదాకు వస్తుందన్న సమాచారం కోసం కోర్టు గుమస్తాలపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండదు. కేసు వాయిదా ఎప్పుడనేది నేరుగా తమ మొబైల్‌కు సంక్షిప్త సందేశం ద్వారా వస్తుంది. త్వరలో న్యాయవాదులు సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇలా ఏ కోర్టులోనైనా తాము ఉంటున్న ప్రాంతం నుంచే ఆన్లైన్లో కేసులు దాఖలు చేసేలా ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ను అభివృద్ధి పరచనున్నారు. తద్వారా రాజమహేంద్రవరం నుంచే ఢిల్లీలోని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. న్యాయవాదులు, కక్షిదారులకు రవాణా, ఇతర ఖర్చులు పెద్ద మొత్తంలో మిగలనున్నాయి. సాంకేతికతఅందిపుచ్చుకోవాలి ఈ కోర్ట్స్ సర్వీసెస్ ద్వారా వేగవంతమైన సేవలు అందుతాయి. అన్ని రంగాల్లో సాంకేతికత పెరుగుతోంది. న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో కేసులు కూడా ఆన్లైన్ ద్వారానే దాఖలు చేసే పరిస్థితి వస్తుంది. ఈ కోర్ట్స్ సర్వీసెస్ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ కోర్ట్స్ సర్వీసెస్ న్యాయవాదులకే గాక కక్షిదారులకూ ఎంతగానో ఉపయోగపడుతుంది. – ముప్పాళ్ల సుబ్బారావు,రాజమహేంద్రవరం బార్‌కౌన్సిల్‌అధ్యక్షుడు -
చీరాలలో న్యాయసేవా సమాచార కేంద్రం ప్రారంభం
చీరాల రూరల్ : ఈ-కోర్ట్సు ఆధ్వర్యంలోని న్యాయసేవా సమాచార కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి ఎ. రాధాకృష్ణ చెప్పారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయసేవా సమాచార కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. తొలుత స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శాంతి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శివశంకరరెడ్డి, న్యాయవాదులు కలసి జిల్లా జడ్జిని సాదరంగా ఆహ్వానించారు. అన ంతరం ఆయన కోర్టు భవన సముదాయాలను పరిశీలించారు. ఆవరణలోని పార్కును తిలకించారు. పార్కులో పచ్చదనాన్ని చక్కగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు. అలానే పార్కులో నూతనంగా ప్రారంభించబోయే న్యాయదేవత విగ్రహాన్నీ పరిశీలించారు. అనంతరం పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన త ర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా చీరాలలోనే ఈ-కోర్ట్సు ఆధ్వర్యంలో న్యాయసేవా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చె ప్పారు. ఈ ఘనత చీరాల కోర్టుకే దక్కుతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చే సిన ఈ న్యాయసేవా సమాచార కే ంద్రం ద్వారా న్యాయవాదులకు, కక్షిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కోర్టులో ప్రతి కేసును ఆన్లైన్లో పెట్టడం వలన కంప్యూటర్ ద్వారా ఇంటి నుంచి కూడా కేసు ఏ దశలో ఉంది, ఇరుపక్షాల న్యాయవాదులు ఎవరు, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చునన్నారు. అనంతరం న్యాయమూర్తిని న్యాయవాదులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శాంతి, జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శివశంకర్‌రెడ్డి, న్యాయవాద సంఘ అధ్యక్షుడు దూళిపాళ్ల శ్రీనివాసరావు,న్యాయవాదులు కర్నేటి రవికుమార్, ఎం.వి.చలపతిరావు, ఏజీపీ సాయిబాబు, కరేటి రవికుమార్‌రెడ్డి, మిక్కిలి పుల్లయ్య, ఎ.సత్యనారాయణ, పింజ ల ప్రసాద్, సిహెచ్. మస్తాన్‌రావు, గౌరవ రమేష్‌బాబు, బూదరాజు శశికిరణ్, రాజు వెంకటేశ్వరరెడ్డి, బోయిన రమేష్‌బాబు, చల్లా సురేష్, బిఎన్. మూర్తి, బత్తుల అమృత్‌కుమార్, మంకెన అశోక్‌కుమార్ పాల్గొన్నారు.