సాక్షి, హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న నగర పోలీసు కమిషనరేట్ కాగిత రహితంగా మారుతోంది. అంతర్గత పరిపాలనతో పాటు పిటిషన్ల విచారణ, కేసుల దర్యాప్తుల ఉత్తరప్రత్యుత్తరాలు సైతం ఆన్‌లైన్‌లోనే సాగేలా కొత్వాల్ అంజినీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు.
ఈ ఇబ్బందులకు తావు లేకుండా
ప్రస్తుతం కమిషనరేట్‌లో అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత అది కేసుగా మారడానికి, ఆపై దర్యాప్తు జరగడానికి, చార్జ్‌షీట్ దాఖలు కావడానికి ఆ ఫైల్ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు అనుమతుల కోసం వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది ఫైళ్ల రూపంలోనే జరుగుతుండటంతో ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టం. ఏదిఏమైనా జవాబుదారీతనం కొరవడిన కారణంగా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాలైన అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులకు సంబంధించిన ఫైళ్ల విషయంలోనే అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీకుమార్ ఈ–ఆఫీస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.
డ్యాష్‌బోర్డ్ ఏర్పాటుకు నిర్ణయం..
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తున్న పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. ఓ బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసే సిబ్బంది ఇంట్రానెట్‌లోని ప్రత్యేక లైన్‌లో పొందుపరుస్తారు. అక్కడ నుంచి ఈ పిటిషన్ ఎవరి వద్దకు వెళ్లింది? వారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎన్ని రోజులుగా, ఎక్కడ పెండింగ్‌లో ఉంది? అనే అంశాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్ అధికారులకు వచ్చిన దరఖాస్తులకూ ఇదే వర్తిస్తుంది. ఈ ఇంట్రానెట్‌కు సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్/పిటిషన్ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను మానిటర్ చేయవచ్చు.
ప్రస్తుతం అంతర్గతంగానే..
ప్రస్తుతం ఈ–ఆఫీస్ విధివిధానాలకు సంబంధించి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు గోషామహల్‌లోని ఈ–లెర్నింగ్ సెంటర్‌లో శిక్షణ ఇచ్చారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులకు గురువారం జరగనుంది. ఆన్‌లైన్‌లో ఉండే ఈ–ఆఫీస్ పూర్తి భద్రంగా ఉండేలా, హ్యాకింగ్ బారినపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ సర్వర్లు కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) సర్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు డిజిటల్ సిగ్నేచర్ కేటాయిస్తారు. ప్రాథమికంగా సిటీ పోలీసు విభాగంలోనే అమలయ్యే ఈ విధానాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇతర విభాగాలతో సంప్రదింపులకూ ఆన్‌లైన్ విధానాన్నే అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈ–కోర్ట్స్‌తోనూ అనుసంధానం
పోలీసుస్టేషన్‌లో నమోదయ్యే కేసుల దర్యాప్తులో వివిధ దశలు, పూర్తి చేయాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఇకపై కేసు డైరీ ఫైల్ అప్‌డేట్‌తోపాటు ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతాయి. ఫలితంగా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించే, ఉద్దేశపూర్వకంగా కేసుల్ని నీరుగార్చే అధికారుల్ని గుర్తించడం సాధ్యమవుతుంది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మాత్రం ప్రింట్‌ఔట్స్ తీసి పత్రాల రూపంలోనే దాఖలు చేయనున్నారు. భవిష్యత్తులో పోలీసు ఈ–ఆఫీస్‌ను న్యాయ విభాగానికి చెందిన ఈ–కోర్ట్స్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. ఇది జరిగితే అభియోగపత్రాలు సైతం ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. ఈ దశకు చేరుకోవాలంటే దేశవ్యాప్తంగా అమలవుతున్న సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment