paper less
-
నిర్మలమ్మ స్ఫూర్తితో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ 2021 ను కాగితం లేకుండా ప్రవేశపెట్టింది. చరిత్రలో మొదటిసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూట్‌కేసుతో కాకుండా ట్యాబ్ పట్టుకొచ్చి పార్లమెంట్లో చదివి వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మాదిరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిజిటల్ బడ్జెట్ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ట్యాబ్స్ కొనాలని సూచించింది. ‘కాగితం లేకుండా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం.. అందరూ ట్యాబ్‌లు కొనండి’ అంటూ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఆ ట్యాబ్‌ల కోసం రూ.50 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారంతా ట్యాబ్స్ కొనుగోలు చేస్తే రూ.50 వేలు చెల్లిస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది. అది కూడా యాపిల్ ట్యాబ్స్ కొనాలని సూచించింది. దీనికోసం ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేయనుంది. ఈనెల 18వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపు ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ డిజిటల్ రూపంలో మార్చేందుకు యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రులు కూడా ఈ కేబినేట్ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కాగితం రహిత బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తెలిపారు. -
పేపర్ లెస్ విధానానికి అలవాటుపడాలి
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్‌స్టేషన్‌లో ఇక నుంచి పేపర్ లెస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు సంబంధిత ఏసీపీలు, సీఐలు, ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది పేపర్ లెస్ విధానాన్ని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. అందుకోసం సంబంధిత అధికారులు పోలీస్‌స్టేషన్‌లో కేసుల అన్ని వివరాలు ట్యాబ్స్ లేదా, ప్యాడ్లను ఉపయోగించాలన్నారు. ఇందులో పోలీస్‌స్టేషన్‌లో కేసుల వివరాలు, కోర్టు పనులలో అన్ని విషయాలను పొందుపర్చాలన్నారు. దీంతోపాటు క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టంలో పోలీస్‌స్టేషన్‌లోని ఎఫ్ఐఆర్, కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో సమస్యత్మాక ప్రాంతాలలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేసి దోషులను అరెస్టు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూఎస్లపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్‌లు ఏర్పాటు చేసి త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి లాడ్జీల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. నేరాలు అరికట్టేందుకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను పక్కగా నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అదే పనిగా నేరాలకు అలవాటు పడిన నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. సమావేశంలో అదనపు డీసీపీలు శ్రీధర్‌రెడ్డి, ఆకుల రాంరెడ్డి, ఆర్మూర్, బోధన్, ఏఆర్ ఏసీపీలు శివకుమార్, రఘు, సీహెచ్ మహేశ్వర్, అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సీసీఆర్బీ ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్, ఆర్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
సిటీ పోలీస్.. ఇక పేపర్ లెస్!
సాక్షి, హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న నగర పోలీసు కమిషనరేట్ కాగిత రహితంగా మారుతోంది. అంతర్గత పరిపాలనతో పాటు పిటిషన్ల విచారణ, కేసుల దర్యాప్తుల ఉత్తరప్రత్యుత్తరాలు సైతం ఆన్లైన్లోనే సాగేలా కొత్వాల్ అంజినీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. ఈ ఇబ్బందులకు తావు లేకుండా ప్రస్తుతం కమిషనరేట్‌లో అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత అది కేసుగా మారడానికి, ఆపై దర్యాప్తు జరగడానికి, చార్జ్‌షీట్ దాఖలు కావడానికి ఆ ఫైల్ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు అనుమతుల కోసం వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది ఫైళ్ల రూపంలోనే జరుగుతుండటంతో ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టం. ఏదిఏమైనా జవాబుదారీతనం కొరవడిన కారణంగా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాలైన అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులకు సంబంధించిన ఫైళ్ల విషయంలోనే అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీకుమార్ ఈ–ఆఫీస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. డ్యాష్‌బోర్డ్ ఏర్పాటుకు నిర్ణయం.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తున్న పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. ఓ బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసే సిబ్బంది ఇంట్రానెట్‌లోని ప్రత్యేక లైన్లో పొందుపరుస్తారు. అక్కడ నుంచి ఈ పిటిషన్ ఎవరి వద్దకు వెళ్లింది? వారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎన్ని రోజులుగా, ఎక్కడ పెండింగ్‌లో ఉంది? అనే అంశాలు ఆన్లైన్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్ అధికారులకు వచ్చిన దరఖాస్తులకూ ఇదే వర్తిస్తుంది. ఈ ఇంట్రానెట్‌కు సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్/పిటిషన్ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను మానిటర్ చేయవచ్చు. ప్రస్తుతం అంతర్గతంగానే.. ప్రస్తుతం ఈ–ఆఫీస్ విధివిధానాలకు సంబంధించి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు గోషామహల్‌లోని ఈ–లెర్నింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులకు గురువారం జరగనుంది. ఆన్లైన్లో ఉండే ఈ–ఆఫీస్ పూర్తి భద్రంగా ఉండేలా, హ్యాకింగ్ బారినపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ సర్వర్లు కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సర్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు డిజిటల్ సిగ్నేచర్ కేటాయిస్తారు. ప్రాథమికంగా సిటీ పోలీసు విభాగంలోనే అమలయ్యే ఈ విధానాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇతర విభాగాలతో సంప్రదింపులకూ ఆన్లైన్ విధానాన్నే అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ–కోర్ట్స్తోనూ అనుసంధానం పోలీసుస్టేషన్లో నమోదయ్యే కేసుల దర్యాప్తులో వివిధ దశలు, పూర్తి చేయాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఇకపై కేసు డైరీ ఫైల్ అప్డేట్తోపాటు ఇవన్నీ ఆన్లైన్లోనే సాగుతాయి. ఫలితంగా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించే, ఉద్దేశపూర్వకంగా కేసుల్ని నీరుగార్చే అధికారుల్ని గుర్తించడం సాధ్యమవుతుంది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మాత్రం ప్రింట్‌ఔట్స్ తీసి పత్రాల రూపంలోనే దాఖలు చేయనున్నారు. భవిష్యత్తులో పోలీసు ఈ–ఆఫీస్‌ను న్యాయ విభాగానికి చెందిన ఈ–కోర్ట్స్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. ఇది జరిగితే అభియోగపత్రాలు సైతం ఆన్లైన్లోనే దాఖలు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. ఈ దశకు చేరుకోవాలంటే దేశవ్యాప్తంగా అమలవుతున్న సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. -
నో ఆఫ్‌లైన్..ఓన్లీ ఆన్లైన్
కందుకూరు: ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ–ఆఫీస్ విధానంతో పాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గించడం, కార్యాలయాల్లో దుబారాను తగ్గించడం తదితర లక్ష్యాలతో అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితపు ఫైల్స్ విధానానికి స్వస్తి పలకనున్నారు. కొత్త విధానం పట్ల కొందరు అధికారుల్లో ఆందోళన ఉన్నా భవిష్యత్‌లో అంతా సవ్యంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైల్స్ అన్నీఈ–ఫైలింగ్ విధానంలోనే... ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనకు కాగితపు ఫైల్ విధానం అమలవుతోంది. దీని వల్ల అధికారులకు శ్రమతో పాటు, పాలనలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన కందుకూరు లాంటి డివిజన్లో ఈ సమస్య మరింత అధికం. మండల కేంద్రాల నుంచి డివిజన్ కేంద్రమైన కందుకూరుకు వచ్చి ఫైల్స్‌పై సంతకాలు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ఫైల్స్ ఇద్దరు ముగ్గురు అధికారుల వద్ద నుంచి చేతుల మారి వచ్చే సరికి నెలల సమయం పడుతోంది. జిల్లా కేంద్రంతోఅనుసంధానమైన ఫైల్స్‌కు ఇదే పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడం శ్రమతో కూడుకున్న పనిగా ఉంది. అదే సందర్భంలో పాలనలో అవినీతి ప్రధాన సమస్యగా మారిపోయింది. అలాగే కాగితపు ఫైల్స్ వల్ల కార్యాలయాలకు అవుతున్న ఖర్చుతో పాటు, దుబారా అధికంగానే ఉంటుంది. వివిధ కారణలతో ఫైల్ ఏ అధికారి వద్ద నిలిచి ఉందో అర్థం కాని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఫైల్ చంకన పెట్టుకుని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి ఇక చరమగీతం పాడనున్నారు. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను ఈ–ఫైలింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇక ప్రతి ఫైల్‌ను ఈ విధానంలోనే పరిష్కరించాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు కాగితాల మీద జరిగిన కార్యకలాపాలు మొత్తం ఇక నుంచి ఆన్లైన్లోనే జరపాల్సి ఉంది. భూమి సమస్యలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మీ–సేవ అర్జీలు, ల్యాండ్ కన్వర్షన్, పట్టాదారు పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్స్ ఇలా ప్రతి ఫైల్‌ను ఇక నుంచి ఈ–ఫైలింగ్ విధానంలోనే పరిష్కరించాలి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే అమల్లోకి వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు ఈ విధానానికి అలవాటు పడాల్సి ఉంది. ఈ–ఫైలింగ్‌లో కందుకూరు మొదటి స్థానం:ఇప్పటికే ఈ–ఫైలింగ్ విధానంపై మూడు నెలలుగా అధికారులకు శిక్షణ ఇచ్చి అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలు ఈ విధానంలో అధికారులు పరిష్కరించారు. ఈ–ఫైల్ విధానంలో కందుకూరు రెవెన్యూ డివిజన్ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా మొత్తం మీద 4,678 ఫైల్స్ పరిష్కారం కాగా, కందుకూరు డివిజన్లోని 24 మండలాల్లో 2729 ఫైల్స్, డివిజన్ కేంద్రమైన ఆర్డీఓ పరిధిలో 1041 ఫైల్స్ ఈ విధానంలో పరిష్కరించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఒంగోలు ఆర్డీఓ పరిధిలో 311 ఫైల్స్, మార్కాపురం ఆర్డీఓ పరిధిలో 597 ఫైల్స్ ఈ ఫైల్ విధానంలో పరిష్కరించారు. ఇక నుంచి ప్రతి ఫైల్ ఆన్లైన్లోనే కదలాల్సి ఉంది. పాలనలో పారదర్శకత పెరుగుతుంది ప్రభుత్వ పాలనలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఫైల్ విధానం అమల్లోకి వచ్చింది. దీని వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుంది. అనవసర జాప్యం, దుబారా తగ్గుతుంది. నిర్ణీత సమయంలోనే సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ జాప్యం అయితే ఎవరి వద్ద జాప్యం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అలాగే కొత్త విధానానికి అధికారులు, సిబ్బంది అలవాటు పడాలి. ఇక నుంచి ప్రతి ఫైల్‌ను కచ్చితంగా ఈ–ఫైల్ విధానంలోనే పంపాలి. – మల్లికార్జున, కందుకూరు ఆర్డీఓ -
కాగిత రహిత పాలనలో వెనుకబడిన జిల్లా
– 8నెలల నుంచి చెబుతున్నా పట్టించుకోలేదు – మాన్యువల్‌గా ఫైళ్లు పంపితే సహించేది లేదు – కార్యాలయాలను ఈ– ఆఫీసులుగా మార్చండి – జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ‘ఎనిమిది నెలల నుంచి చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కాగిత రహిత పాలనలో జిల్లా పూర్తిగా వెనుకబడి పోయింది. ఇది బాధాకరం’ అంటూ అధికారులపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రధానంగా ఈ– ఆఫీసులపై సమీక్ష నిర్వహించారు. కాగిత రహిత పాలనలో అట్టడుగున ఉన్నందున అన్ని శాఖల అధికారులు ఇప్పటికైనా ఈ ఆఫీసులోకి మారాలని సూచించారు. ఇక నుంచి మాన్యువల్‌గా ఫైళ్లు పంపరాదని, పంపినా వాటిని చూడటం జరగదని చెప్పారు. ఈ–ఆఫీసులను నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జూనియర్ అసిస్టెంట్ మొదలు కొని జిల్లా అధికారి వరకు మంగళవారం లోగా డిజిటల్ టోకన్ తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. నీటి సమస్య, పశుగ్రాసం కొరతపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. ఆర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తుంగభద్ర దిగువ కాలువకు ఏప్రిల్ ఒకటి నుంచి నీళ్లు విడుదల చేస్తున్నామని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మాన్యువల్ ఫైళ్ల ప్రక్రియను ముగించండి
- రేపటి నుంచి వందశాతం కాగిత రహిత పాలన - ఆర్డీఓలు, తహసీల్దార్ల సమావేశంలో డీఆర్వో కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూశాఖలో కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మాన్యువల్ ఫైళ్ల ప్రక్రియకు చరమగీతం పాడాలని, వందశాతం కాగిత రహిత పాలనకు ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు సూచించారు. ఇందుకు సంబంధించి శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో తహసీల్దార్లు, ఆర్డీఓల సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 తర్వాత మాన్యువల్ ఫైళ్లు కనిపించరాదని డీఆర్వో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ మొదలు తహసీల్దారు, ఆర్డీఓ వరకు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని, డిజిటల్ సిగ్నేచర్ కీ తీసుకోవాలన్నారు. నోట్ ఫైల్ తయారీ నుంచి ఆమోదం వరకు అన్ని పనులు ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఫైళ్లన్నీ స్కాన్ చేసి కంప్యూటరీకరించాలన్నారు. 20 తర్వాత మాన్యువల్‌గా ఫైళ్లు పంపే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇదే సందర్భంగా ఎన్ఐసీ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రాజశేఖర్ కాగిత రహిత పాలన విధి విధానాలను వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఈ- ఆఫీసులుగా మార్చడంలో ఉత్పన్నమయ్యే సమస్యలు, పరిష్కారాలు తెలియజేశారు. ఇందుకు సంబంధించి తహసీల్దార్ల అనుమానాలను నివృతి చేశారు. సమావేశంలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్లు, సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.