కాగిత రహిత పాలనలో వెనుకబడిన జిల్లా
కాగిత రహిత పాలనలో వెనుకబడిన జిల్లా
Published Mon, Mar 27 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
– 8నెలల నుంచి చెబుతున్నా పట్టించుకోలేదు
– మాన్యువల్‌గా ఫైళ్లు పంపితే సహించేది లేదు
– కార్యాలయాలను ఈ– ఆఫీసులుగా మార్చండి
– జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): ‘ఎనిమిది నెలల నుంచి చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కాగిత రహిత పాలనలో జిల్లా పూర్తిగా వెనుకబడి పోయింది. ఇది బాధాకరం’ అంటూ అధికారులపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రధానంగా ఈ– ఆఫీసులపై సమీక్ష నిర్వహించారు. కాగిత రహిత పాలనలో అట్టడుగున ఉన్నందున అన్ని శాఖల అధికారులు ఇప్పటికైనా ఈ ఆఫీసులోకి మారాలని సూచించారు. ఇక నుంచి మాన్యువల్‌గా ఫైళ్లు పంపరాదని, పంపినా వాటిని చూడటం జరగదని చెప్పారు.
ఈ–ఆఫీసులను నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జూనియర్ అసిస్టెంట్ మొదలు కొని జిల్లా అధికారి వరకు మంగళవారం లోగా డిజిటల్ టోకన్ తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. నీటి సమస్య, పశుగ్రాసం కొరతపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. ఆర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తుంగభద్ర దిగువ కాలువకు ఏప్రిల్ ఒకటి నుంచి నీళ్లు విడుదల చేస్తున్నామని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement