లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ 2021 ను కాగితం లేకుండా ప్రవేశపెట్టింది. చరిత్రలో మొదటిసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూట్‌కేసుతో కాకుండా ట్యాబ్ పట్టుకొచ్చి పార్లమెంట్‌లో చదివి వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మాదిరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిజిటల్ బడ్జెట్ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ట్యాబ్స్ కొనాలని సూచించింది. ‘కాగితం లేకుండా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం.. అందరూ ట్యాబ్‌లు కొనండి’ అంటూ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఆ ట్యాబ్‌ల కోసం రూ.50 వేలు చెల్లిస్తామని ప్రకటించారు.
ఉత్తర్ప్రదేశ్‌లో మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారంతా ట్యాబ్స్ కొనుగోలు చేస్తే రూ.50 వేలు చెల్లిస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది. అది కూడా యాపిల్ ట్యాబ్స్ కొనాలని సూచించింది. దీనికోసం ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేయనుంది. ఈనెల 18వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపు ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ డిజిటల్ రూపంలో మార్చేందుకు యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రులు కూడా ఈ కేబినేట్ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కాగితం రహిత బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment