బడ్జెట్ సమావేశాలు షురూ
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
అనంతరం సభ వాయిదా
నేడు దివంగత ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి మృతికి సంతాపం
ఆపై సమావేశం కానున్న బీఏసీ.. ఆదివారం సభ నిర్వహణపై నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాల ముందే ప్రసంగం మొదలు పెట్టిన గవర్నర్...25 నిమిషాల్లో ప్రసంగం ముగించారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుందని భావించినా జరగలేదు. ‘‘బీఏసీ సమావేశాన్ని శుక్రవారం జరుపుతాం. సభ మొదలు కాగానే దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి హఠాన్మరణానికి సంతాప తీర్మానం ఉంటుంది. అనంతరం బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తాం. మొత్తం పనిదినాల్లో ఒకరోజు సంతాప దినం పోవడం వల్ల ఒక పనిరోజు తగ్గుతోంది. దీన్ని కవర్ చేయడానికి ఆదివారం కూడా సభ జరపాలా, వద్దా అని ఆలోచిస్తున్నాం. ఈ విషయంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటాం. శనివారం నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలవుతుంది’’ అని మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ లాబీల్లో మీడియాకు చెప్పారు.
అమరవీరులకు నివాళి
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయం 10 గంటలకు గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. టీటీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు వేసుకుని తొలుత టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, సాయన్నలు కలసి అసెంబ్లీకి చేరుకోగా మరో ఎమ్మెల్యే వివేకానంద కొంత ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చారు. తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని బుధవారం స్పీకర్‌కు లేఖ రాసిన మరో ఇద్దరు టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలు తొలిరోజు సమావేశాలకు హాజరు కాలేదు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాక సమావేశాలకు హాజరుకావాలని వారు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రశాంతంగా సభ
గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడటం, ప్రసంగ ప్రతులను చించి ఆయనపై విసరడం వంటి ఘటనల నేపథ్యంలో ఈసారి అటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని, నిరసన తెలిపే ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం హెచ్చరికలా పనిచేసింది. సభలో నిరసనలేవీ జరగకుండా గవర్నర్ ప్రసంగం ప్రశాంతంగా ముగిసింది. దీనిపై మంత్రి హరీశ్ స్పందిస్తూ ‘‘ఉద్యమ సమయంలో అసెంబ్లీలో నిరసనలకు దిగడం నాడు అవసరమైన పోరాట రూపం. ప్రస్తుతం తెలంగాణ కల సాకారమైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలి. సభ హుందాగా సాగాలి. గవర్నర్‌ను గౌరవించాలి. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నాం. కానీ ఎవరినీ హెచ్చరించలేదు’’ అని పేర్కొన్నారు.