ఫిరాయింపుల ప్రస్తావన ఏది?: ఉత్తమ్
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో రాజకీయ ఫిరాయింపుల ప్రస్తావన ఏదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అధికార టీఆర్‌ఎస్ నిస్సిగ్గుగా చేర్చుకుందని గురువారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శిం చారు.
ఫిరాయింపులకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని గవర్నర్ ప్రసంగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాల పట్ల ప్రభుత్వానికి కొంత కూడా గౌరవం లేదని విమర్శించారు. అనైతికంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోకుండా ప్రశంసించే విధంగా గవర్నర్ ప్రసంగం ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.