ఈ కోర్ట్స్ సర్వీసెస్ యాప్
సాక్షి, రాజమహేంద్రవరం: న్యాయసేవలకు సాంకేతిక సొబగులు అద్దుతున్నారు. ఇప్పటి వరకు కోర్టు గుమాస్తాలపై న్యాయవాదులు, న్యాయవాదులపై కక్షిదారులు సమాచారం కోసం ఆధారపడేవారు. ఇకపై ఆ సమస్య లేకుండా న్యాయశాఖ ‘ఈ కోర్ట్స్‌సర్వీసెస్’ ప్రవేశపెట్టింది. ‘సర్వీసెస్.ఈకోర్ట్స్.జీవోవి.ఇన్’ పేరుతో వెబ్‌సైట్, ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసింది. జాతీయ స్థాయిలో అన్ని కోర్టులను సాంకేతిక పరంగా ఒకే గొడుగుకు కిందకు తెచ్చారు. ఆయా న్యాయస్థానాల్లో పని చేసే న్యాయవాదులు తాము పనిచేసే న్యాయస్థాన ప్రాంతం, పేరు, జన్మించిన తేదీ, ఆధార్ నంబర్, బార్‌కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, కార్యాలయం, నివాసం చిరునామా, ఫ్యాక్స్ నంబర్ సమాచారాన్ని ఆయా న్యాయస్థానాలు సేకరించి ‘ఈకోర్ట్స్‌సర్వీసెస్’లో నమోదు చేస్తున్నాయి.
ప్రతి న్యాయవాదికి ప్రత్యేకంగా సీఎన్‌ఆర్ నంబర్ కేటాయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఈ ప్రక్రియ పూర్తయింది. న్యాయవాదుల సమాచారంతోపాటు ఆయా న్యాయస్థానాల్లో వారు దాఖలు చేసిన కేసుల సమాచారం, కక్షిదారుడు, అతని ఫోన్ నంబర్, చిరునామా, ఆధార్ తదితర వివరాలతో కేసు నమోదు చేసే సమయంలో కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. కేసు నంబర్‌ను కోర్టు కేటాయిస్తుంది. ఆ కేసు నంబర్‌తో న్యాయవాదులు, కక్షిదారులు తమ ఇంటి నుంచే ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ ద్వారా తమ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? కేసు వాయిదా ఎప్పుడు? తుది విచారణ ఎప్పుడు జరుగుతుంది? ప్రతివాది ఎవరు? వారి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎవరు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. కోర్టులు జారీ చేస్తున్న నోటీసులు కూడా నేరుగా ఆయా న్యాయవాదులు, కక్షిదారులకు చేరుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి.
గిమ్మిక్కులకు ఇకపై చెక్...
ఏదైనా ఒక కోర్టులో దాఖలు చేసిన కేసు వివరాలను దేశంలో ఎక్కడ నుంచైనా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ ఎంతగానో ఉపయోగపడుతోంది. కేసు నంబర్ ద్వారా న్యాయవాది, కక్షిదారు తమ కేసు తాజా స్థితిని ఎక్కడ నుంచైనా తెలుసుకోవచ్చు. కేసు దాఖలు చేయకుండా చేశామని, వాయిదా లేకపోయినా ఫలానా రోజున వాయిదా అంటూ కొంతమంది న్యాయవాదులు గిమ్మిక్కులు చేసి ఫీజు వసూలు చేసేవారు. అయితే ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ వల్ల ఆ గిమ్మిక్కులకు ఇక కాలం చెల్లినట్టయింది. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు కక్షిదారులు తమ కేసు విచారణ స్థితిని తెలుసుకోవచ్చు. న్యాయవాదులు తాము దాఖలు చేసిన కేసు ఎప్పుడు వాయిదాకు వస్తుందన్న సమాచారం కోసం కోర్టు గుమస్తాలపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండదు. కేసు వాయిదా ఎప్పుడనేది నేరుగా తమ మొబైల్‌కు సంక్షిప్త సందేశం ద్వారా వస్తుంది. త్వరలో న్యాయవాదులు సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇలా ఏ కోర్టులోనైనా తాము ఉంటున్న ప్రాంతం నుంచే ఆన్‌లైన్‌లో కేసులు దాఖలు చేసేలా ‘ఈ కోర్ట్స్ సర్వీసెస్’ను అభివృద్ధి పరచనున్నారు. తద్వారా రాజమహేంద్రవరం నుంచే ఢిల్లీలోని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. న్యాయవాదులు, కక్షిదారులకు రవాణా, ఇతర ఖర్చులు పెద్ద మొత్తంలో మిగలనున్నాయి.
సాంకేతికతఅందిపుచ్చుకోవాలి
ఈ కోర్ట్స్ సర్వీసెస్ ద్వారా వేగవంతమైన సేవలు అందుతాయి. అన్ని రంగాల్లో సాంకేతికత పెరుగుతోంది. న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో కేసులు కూడా ఆన్‌లైన్ ద్వారానే దాఖలు చేసే పరిస్థితి వస్తుంది. ఈ కోర్ట్స్ సర్వీసెస్ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ కోర్ట్స్ సర్వీసెస్ న్యాయవాదులకే గాక కక్షిదారులకూ ఎంతగానో ఉపయోగపడుతుంది.
– ముప్పాళ్ల సుబ్బారావు,రాజమహేంద్రవరం బార్‌కౌన్సిల్‌అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment