పకడ్బందీగా ఈ-పహాణీ
అధికారులకు సీసీఎల్ఏ ఆదేశం
క్షేత్రస్థాయి సమాచారమంతా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రైతులు, పంట భూముల వివరాల నమోదు కోసం రెవెన్యూశాఖ చేపట్టిన ఈ-పహాణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖకు సంబంధించిన పలు అంశాలపై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. కంప్యూటర్లో కేవలం ఒక్క క్లిక్ చేస్తే భూములకు సంబంధించిన వివరాలన్నీ ... (మెట్ట/మాగాణి), సర్వే నంబరు, విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతు, పంట.. తదితర వివరాలు స్క్రీన్‌పై కనిపించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. భూముల వివరాలన్నీ ఆన్లైన్ చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఐప్యాడ్లతోనే వివరాలు నమోదు
ప్రభుత్వం అందజేసిన ఐప్యాడ్లతో గ్రామ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశాకే సదరు భూముల వివరాలను అక్కడ్నుంచే ఆన్లైన్లో నమోదు చేయాలని రేమండ్ పీటర్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డులను, గ్రామ పటాల(మ్యాపు)లను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని సూచించారు.
అయితే.. గతంలో సీసీఎల్ఏ రూపొందించిన కన్వీనియన్స్ డీడ్ నమూనాను ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించకపోవడం, దీనివల్లనే క్రమబద్ధీకరణ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందన్న అంశంపై మాత్రం సీసీఎల్ఏ మాట్లాడకపోవడం పట్ల క్షేత్రస్థాయి అధికారులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా క్షేత్రస్థాయిలో అధికారులను పరుగులు పెట్టించడం వలన ప్రయోజనమేమిటని వాపోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.