e-Panchayat system
-
2న ఈ- పంచాయత్ ప్రారంభం
తొలి దశలో జనన, మరణ ధ్రువపత్రాలు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం తల పెట్టిన ఈ-పంచాయత్ వ్యవస్థను గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2)న ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దీనిద్వారా గ్రామీణ ప్రజలకు ఈ-గవర్నెన్స్ ఫలాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-పంచాయత్‌ల ఏర్పాట్లకు సంబంధించి పంచాయతీరాజ్, ఐటీశాఖ అధికారులతో శుక్రవారం కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో జనన, మరణ ధ్రువపత్రాల వంటి పౌరసేవలను అందిస్తారని, ఆపై జాతీయ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు, ఆసరా పింఛన్ల పంపిణీ అందించనున్నట్లు చెప్పారు. ఆర్థిక సేవల విషయమై పలు బ్యాంకులతో చర్చిస్తున్నామని, ప్రభుత్వం తరఫున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ-పంచాయత్‌ల నిర్వహణ నిమిత్తం విలేజ్ లెవల్ ఎంట్రెప్రెన్యూర్ (వీఎల్ఈ)లను నియమిస్తామని, ఆయా గ్రామాల్లో డిగ్రీ అర్హత కలిగిన మహిళలకే వీఎల్‌ఈలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. ఈ- పంచాయత్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ పూర్తయిందని, ఐటీశాఖ ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీఎల్ఈలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంట ర్నెట్ ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా వాటర్‌గ్రిడ్ పనులతోపాటు ఫైబర్ ఆ ప్టిక్ కేబుల్ వేయాలని, ఇందుకోసం త్వరగా పూర్తిస్థాయి డిజైన్‌ను రూపొందించాలన్నా రు. సమావేశంలో పంచాయతీరాజ్ ము ఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
పంచాయతీల్లోనే అన్ని సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద సమగ్ర సేవా కేంద్రా (వన్‌స్టాప్ షాప్)లను పంచాయతీ కార్యాలయాల్లోనే ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ-పంచాయత్ వ్యవస్థను కూడా సమగ్ర సేవా కేంద్రాల్లోనే విలీనం చేయనున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎంపిక చేసిన 150 మండలాల్లో ఈ ఏడాది వెయ్యి సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో మిగిలిన గ్రామాలకూ విస్తరించనున్నారు. వన్‌స్టాప్ షాప్‌ల ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకుకు అప్పగిస్తూ రూ. 64 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అన్ని సేవలూ ఒకేచోట.. గ్రామీణ ప్రజలకు ఈ-పంచాయత్, మీసేవ, శ్రీనిధి కియోస్క్‌ల నుంచి ప్రస్తుతం లభిస్తున్న సేవలన్నింటినీ ఇకపై ఒకేచోట లభ్యమయ్యేలా సమగ్ర సేవా కేంద్రాలను ఆయా సంస్థలకు అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా ఓఎస్‌ఎస్‌ల నుంచే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలను తెరుచుకునే సదుపాయం కల్పిస్తున్నారు. స్వయం సహాయక గ్రూపులకు పావలా వడ్డీ రుణాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపులు, ఆసరా పెన్షనర్లకు పింఛను సొమ్ము.. తదితర చెల్లింపులన్నీ ఇక్కడ్నుంచే లభ్యమవుతాయి. అన్నిరకాల ధ్రువపత్రాల కోసం దరఖాస్తులను ఓఎస్‌ఎస్‌ల నుంచే సమర్పించవచ్చు. పొదుపు ఖాతాలు, నగదు జమ, డిపాజిట్లు, అన్ని రకాల చెల్లింపులు.. తదితర సేవలను సెప్టెంబర్ నుంచి ఓఎస్‌ఎస్‌ల నుంచే గ్రామంలోని ప్రజలందరూ పొందవచ్చు. నిర్వహణ బాధ్యత వీఎల్ఈలకే.. వన్‌స్టాప్ షాప్‌ల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక గ్రూపుల నుంచి మహిళల (విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైనర్)ను ఎంపిక చేస్తారు. వీఎల్ఈ నియామకానికి ఇంటర్ విద్యార్హత కాగా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా చేసేందుకు అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.