E - Panchayats
-
2400 గ్రామాల్లో ఇ-పంచాయతీలు
అన్ని సేవలూ ఆన్లైన్ ద్వారానే ఉపాధి చెల్లింపుల కోసం ‘వన్ స్టాప్ షాఫు’ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 2,400 గ్రామ పంచాయతీలను ఇ- పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వాటిని కంప్యూటరీకరించి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు, లే అవుట్ ఫీజులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ, మన ఊరు- మన ప్రణాళిక తయారీ, పంచాయతీలో చేపట్టే వివిధ పథకాల వ్యయ నిర్వహణతో సహా అన్ని వ్యవహారాలను ఆన్లైన్ ద్వారా చేపడతారు. గ్రామసచివాలయ స్థాయిలో ఇ- పంచాయతీల ఏర్పాటుపై పంచాయతీరాజ్, ఐటీ శాఖలమంత్రి కె.తారకరామారావు బుధవారం విస్తృతస్థాయిలో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఐటీ విభాగం, ఎన్ఐసీ, ఏపీటీఎస్ అధికారులు, పంచాయతీరాజ్ కమిషనర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణలో 8,778 పంచాయతీలుండగా తొలిదశలో 2,400 పంచాయతీలను కంప్యూటరీకరిస్తారు. ఇందులో ‘వన్ స్టాప్ షాపు’ ఏర్పాటు చేసి, దాని ద్వారానే ఉపాధి హామీ చెల్లింపులు, పెన్షన్లు, వాటర్‌షెడ్ తదితర అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ చర్యలు స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీల పాలనలో విప్లవాత్మకమార్పులు తెస్తాయని, పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతాయని ప్రభుత్వం విశ్వసిస్తుంది. వెంటనే ఇ- పంచాయతీలను ప్రారంభించేందుకు ఎన్ని పంచాయతీల పరిధిలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులో ఉందోనన్న వివరాలను పంచాయతీరాజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇకపై ఈ-పంచాయతీలు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రజలకు పారదర్శక, వేగవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీలను ‘ఈ-పంచాయతీలు’గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో గ్రామపంచాయతీల ద్వారా అందే అన్ని సేవలు ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే అందనున్నాయి. అలాగే పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం మొదటి విడతగా జిల్లాలోని 141 గ్రామపంచాయతీలకు కంప్యూటర్లను మంజూరు చేశారు. పారదర్శక పాలన కోసం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా పాలనలో సంస్కరణలు అవసరమవుతున్నాయి. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంత ప్రజలకు పారదర్శక పాలనను అందించేందుకు పంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 866 గ్రామపంచాయతీలు ఉండగా, మొదటి విడతగా 141 కార్యాలయాలకు కంప్యూటర్లను మంజూరు చేశారు. మండల పరిషత్ కార్యాలయాలకు సైతం ఒక్కో కంప్యూటర్ను అందించారు. కంప్యూటర్‌తో పాటు ప్రింటర్‌ను కూడా అందించారు. మంజూరు చేసిన కంప్యూటర్లను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అమర్చి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను సైతం ప్రైవేటు సంస్థనే ఏర్పాటు చేయనుంది. రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక ఆపరేటర్‌ను ఎంపిక చేయనున్నారు. వారంలో మూడు రోజులు ఒక గ్రామంలో, మరో మూడు రోజులు మరో గ్రామంలో ఆపరేటర్ అందుబాటులో ఉండి విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల విధులు, కోడ్ అమల్లో ఉన్నందున వచ్చే నెలలో అధికారికంగా పంచాయతీల్లో కంప్యూటర్లను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.