టీ తోటల కూలీలకూ బ్యాంకుల్లోనే జీతాలు!
పెద్దనోట్ల రద్దు ప్రభావం అసోంలోని టీ తోటల మీద కూడా గట్టిగానే పడింది. ఇన్నాళ్లూ అక్కడ కూలీలకు వారానికి ఒకసారి జీతాలు నగదురూపంలోనే చెల్లించగా.. ఇప్పుడు వాళ్లందరికీ ఆన్లైన్ చెల్లింపులు చేయబోతున్నారు. అసోంలో ఉన్న మొత్తం 850 టీ తోటలలో దాదాపు 10.5 లక్షల మంది పనిచేస్తుంటారు. వాళ్లందరికీ ఇప్పుడు జనధన యోజన అకౌంట్లు తెరిపించారు. గోలాఘాట్ జిల్లాలో తొలిసారిగా టీ కార్మికులకు బ్యాంకుల ద్వారా జీతాలు ఇస్తున్నారు. దాంతో వాళ్లంతా తమ జీతాలు డ్రా చేసుకోడానికి ఏటీఎంలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు బ్యాంకు ముఖం కూడా చూడని తమకు అక్కడ అకౌంట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని.. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు చేతిలో లేకపోతే ఎలాగని టీ తోటల కార్మికులు అంటున్నారు. దాదాపు 200 ఏళ్లుగా వాళ్లు ప్రతి శనివారం ఆ వారానికి సంబంధించిన జీతం తీసుకుని సంతలో సరుకులు కొనుక్కుని ఇళ్లకు వెళ్తారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామునే 5 గంటలకు పనికి వస్తారు. వీళ్లందరికీ కూడా ఖాతాలు తెరిపించాలని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ బ్యాంకర్లకు సూచించారు. వాళ్లంతా ఇబ్బంది పడకుండా డబ్బులు డ్రా చేసుకోడానికి వీలుగా తగినన్ని ఏటీఎంలు కూడా ఏర్పాటు చేయాలన్నారు.
అన్ని బ్యాంకులూ ఇప్పుడు టీ తోటల సమీపంలోనే ఏటీఎంలు ఏర్పాటుచేస్తాయని, అందువల్ల అక్కడ వాళ్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుందని స్టేట్‌బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీఎస్ఎన్ఎల్ మూర్తి చెప్పారు. దాంతోపాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా స్వైపింగ్ మిషన్ల సాయంతో కూడా వాళ్లు డబ్బులు ఇప్పిస్తామన్నారు. ప్రత్యేక శిబిరాల్లో కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామన్నారు. టీ కార్మికులకు రోజుకు 115-130 రూపాయల వరకు కూలీ ఉంటుంది. అయితే వీళ్లందరికీ సరిపడ సొమ్మును ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లతో ఇప్పిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.