కోర్టుల ముందుకు కెమిస్ట్ ల రగడ
న్యూఢిల్లీ : రిటైల్ మందుల దుకాణాలకు, ఆన్ లైన్ ఫార్మసీలకు మధ్య రగడ ప్రస్తుతం కోర్టుల గడప తొక్కనుంది. ఆన్ లైన్ ఫార్మసీలు కొనసాగిస్తున్న అక్రమ మందుల అమ్మకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ..ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్(ఏఐఓసీడీ) దేశంలోని పది హైకోర్టులను ఆశ్రయించనుంది. అయితే ఈ యుద్ధానికి తాము కూడా సై అంటున్నట్టు ఆన్ లైన్ దుకాణాల వైఖరి కనిపిస్తోంది. ఆన్ లైన్ లో మందుల అమ్మకాలు నిరసిస్తూ రిటైల్ దుకాణాలు దేశవ్యాప్తంగా నిరవధిక బంద్ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ ఫార్మసీలు భారత్ లో అక్రమంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యంపై నష్టం వాటిల్లే ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర డ్రగ్ అథారిటీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐఓసీడీ జనరల్ సెక్రటరీ సురేష్ గుప్తా ఆరోపించారు. ప్రస్తుతమున్న డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్(1940) ఆన్ లైన్ ఫార్మసీలు మందుల అమ్మకానికి అనుమతించదని ఆయన అన్నారు. చట్టాలను కొట్టిపారేసి ఆన్ లైన్ మందుల దుకాణాలు మెడిసిన్లను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. చట్టాలు అనుమతించకుండా అమ్మకాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా చోద్యం చూస్తున్నట్టు ఉన్నాయన్నారు.
ఇది పేషెంట్ల ఆరోగ్యానికి హానికరం కలిగించడంతో పాటు... ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు పెరిగిపోతాయని, నిషేధిత మందులు కూడా జోరుగా అమ్మకాలు జరిగే ప్రమాదముందని వెల్లడించారు. 10 రాష్ట్రాల హైకోర్టులను తాము ఆశ్రయిస్తామని, ఈ సమస్యపై పరిష్కారం కోసం కోర్టులోనే పోరాడతామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ హైకోర్టులలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలిపారు. మరోవైపు తాము చట్టాలకు అనుగుణంగానే అమ్మకాలు నిర్వహిస్తున్నామని ఆన్ లైన్ ఫార్మసీలు చెబుతున్నాయి.