ఇ-పోస్తో పారదర్శకత
► రేషన్ డీలర్ల కమిషన్ పెంపుపై త్వరలో నిర్ణయం
► మంత్రి పరిటాల సునీత
విజయవాడ(భవానీపురం) : ఇ -పోస్ విధానం ద్వారా నిత్యావసర సరుకులను సకాలంలో అందించడంపట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీ (ఆహార సలహా సంఘం) సమావేశం బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇ-పోస్ విధానాన్ని అమలు చేయడం వలన 30 వేల మెట్రిక్ టన్నులు పొదుపు చేశామని, తద్వారా రూ. 300 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని వివరించారు. పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులు, దీపం కనెక్షన్లను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇస్తామని చెప్పారు. 2017 నాటికి ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ అందచేస్తామని తెలిపారు.
చౌక ధరల దుకాణాల డీలర్లకు కమిషన్ పెంచే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎమ్ఎల్ఎస్ పాయింట్ల వద్ద ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేసి డీలర్లకు అందిస్తామన్నారు. వృద్ధులు, వికలాంగులకు నిత్యావసర సరుకులను నేరుగా వారి ఇంటి వద్దకే అందించేలా ‘మీ ఇంటికి - రేషన్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కరికాల వలవన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వంత భవనాలు లేని వినియోగదారుల ఫోరంలకు త్వరలో భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ జి రవిబాబు మాట్లాడుతూ ఇ-పోస్ పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ర్టంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు.
ఏపి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ ఎం లింగారెడ్డి ఆన్లైన్ విధానంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పి చంద్రశేఖరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, వివిధ జిల్లాల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పలు సలహాలు, సూచనలు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ అనూరాధ, ఉన్నతాధికారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.