జంప్ జిలానీ ఎవరు?
‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జంప్‌జిలానీ’. ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ కథానాయికలు. అంబికా కృష్ణ సమర్పణలో అంబికా రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి అంబికా కృష్ణ మాట్లాడుతూ -‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలప్పు’ చిత్రం కథకు పునర్నిర్మాణం ఈ సినిమా. ‘కలగలప్పు’ని ప్రేక్షకుల సమక్షంలో చూశాను. అద్భుతమైన స్పందన. ప్రపంచమంతా మెచ్చే కథ అనిపించింది. వెంటనే పునర్నిర్మాణ హక్కులు సొంతం చేసుకున్నాం. యూటీవీ సంస్థ ఈ కథను హిందీ, మలయాళ భాషల్లో నిర్మిస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని తెలిపారు.
అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రం ఇదని, దర్శకుడు సత్తిబాబు పూర్తి వినోదాత్మకంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పారు. నరేష్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ విజయంగా ఈ చిత్రం నిలుస్తుందని చిత్ర నిర్మాణసారథి అంబికా రామచంద్రరావు తెలిపారు. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, రఘుబాబు, రావురమేశ్, సన, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: సుందర్.సి, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, రచనా సహకారం: సతీశ్ వేగేశ్న, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: విజయ్ ఎబెంజర్, పాటలు: రామజోగయ్యశాస్త్రి.