విద్యుత్ స్తంభం విరిగిపడి లైన్‌మన్ దుర్మరణం
విశాఖపట్నం : వైర్లు బిగిస్తుండగా విద్యుత్ స్తంభం విరిగిపడిన సంఘటనలో లైన్‌మన్ మృతిచెందాడు. లంకెలపాలెం సమీపంలోని కన్నూరులో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. హుద్‌హుద్ తుపానుకు లంకెలపాలెం, అగనంపూడి సెక్షన్ కార్యాలయాల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం తెలిసిందే. వీటిని పునరుద్ధరించేందుకు వారం రోజులక్రితం లంకెలపాలెం సెక్షన్ పరిధిలోని పనుల నిమిత్తం ఖమ్మం జిల్లా సత్తిపల్లి మండలం కిష్టాపురం నుంచి 18 మంది లైన్మెన్లు వచ్చారు.
వీరిలో ఇ. శివ(20) అనే లైన్‌మన్ వైర్లు బిగిస్తుండగా, స్తంభం విరిగిపోయింది. దీంతో పైనుంచి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతనిని అంగనంపూడి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు శివ తల్లిదండ్రులు గతంలో చనిపోయారు. శివ మృతితో అతనిపై ఆధారపడ్డ చెల్లి మమత పరిస్థితి దయనీయంగా మారింది.
విద్యుత్ స్తంభాల్లో నాణ్యత లోపం
విద్యుత్ స్తంభాల నిర్మాణంలో నాణ్యత లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. 4ఎంఎం, 6ఎంఎం ఇనుపరాడ్లు, క్రషర్ బుగ్గితో స్తంభాలను తయారు చేస్తున్నారు. గతంలో ఆర్ఈసీఎస్ స్వంతంగా స్తంభాలను తయారు చేసేది. ఇటీవల ఈ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. పనుల్లో నాణ్యత లోపమే స్తంభం విరిగిపోవడానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.