'భవిష్యత్తులో ఎలాంటి పరీక్ష రాయకుండా వేటు'
కాకినాడ : రేపు (ఏప్రిల్ 29) జరుగనున్న ఏపీ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా గురువారం 'సాక్షి'కి వివరించారు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందే అనుమతి ఇస్తారని, నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్తులో ఎలాంటి పరీక్ష రాయకుండా వేటు వేస్తామని సాయిబాబా హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లోకి సాంకేతిక పరికలరాలకు అనుమతి లేదన్నారు.
ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2 గంటలకు మెడికల్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఏపీలో 494 పరీక్షా కేంద్రాలను, తెలంగాణలో 52 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. 2,92,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. కాగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తోంది.