eamcet entrance exam
-
TS EAMCET: ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. -
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. 4, 5, 6, 9, 10వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ విద్యార్థుల కోసం టెస్ట్‌లు ఉంటాయి. ఈసారి హాల్‌టికెట్‌తో పాటు పరీక్షాకేంద్రం రూట్‌మ్యాప్ ఇచ్చారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులను గంటంపావు ముందు నుంచి పరీక్షాహాల్లోకి అనుమతిస్తారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి.. కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్ డిక్లరేషన్ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు వంటివి ఉన్నవారికి ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. బాల్ పాయింట్ పెన్, హాల్‌టికెట్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. భౌతికదూరం ప్రకారం ఆన్ లైన్లో పరీక్ష ఉంటుంది. ఎంసెట్ మార్కులు 160 కాగా జనరల్ కేటగిరీ అభ్యర్థుల అర్హతకు 40 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. పరీక్షాపత్రం ఇంగ్లిషు–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక కేటగిరీ భాషల్లో పరీక్షాపత్రం ఇస్తారు. -
ప్రారంభమైన టీ.ఎంసెట్ ప్రవేశపరీక్ష
హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్–17 పరీక్ష శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఉదయం ఎంసెట్ కోడ్ జె-1ను విడుదల చేశారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న ఎంసెట్ 2017 అగ్రికల్చర్, ఫార్మసీ ఇతర విభాగాల పరీక్ష కోసం సెట్ కోడ్ S2 ను విడుదల చేశారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 41వేల 163 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రి, ఫార్మసీ, వెటర్నరీ పరీక్షకు 79,46 మంది హాజరు అవుతున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 246 పరీక్ష కేంద్రాలు, అగ్రి, ఫార్మాకు 154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను గంట ముందుగానే అనుమతి ఇచ్చారు. ఇక ఈ ఎంసెట్‌కు ఏపీ నుంచి 35 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. -
‘ఎం-సెట్’ నిర్వహణలో అక్రమాలు!
అనేకచోట్ల ఆలస్యంగా జరిగిన ‘ప్రైవేట్’ వైద్య పరీక్ష ♦ కొందరు అభ్యర్థులకు నిర్వాహకులు సహకరించారన్న ఆరోపణలు ♦ మంగళవారం అర్ధరాత్రి వరకు డౌన్లోడ్ కాని హాల్‌టికెట్లు ♦ 5,130 మంది హాజరైనట్లు వైద్య శాఖ వెల్లడి ♦ తప్పుడు లెక్కలని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణ ♦ రేపు ఫలితాలతోపాటు తుది కీ విడుదల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎం-సెట్)లో ‘హైటెక్’ అక్రమాలు జరిగినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాకుండా పకడ్బందీగా వ్యవహరించిన యాజమాన్యాలు... విద్యార్థులు, సర్కారు నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో కొంత పట్టు సడలించారు. దీంతో అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వందలాది మంది విద్యార్థులు హాల్‌టికెట్లు పొందే హడావుడిలోనే మునిగిపోయారు. తమకు హాల్‌టికెట్ డౌన్లోడ్ కాలేదని, దీనిపై హైకోర్టుకు వెళ్తానని కరీంనగర్‌కు చెందిన విద్యార్థిని తండ్రి మార్కండేయ తెలిపారు. ఈ పరీక్షకు భారీగా విద్యార్థులు హాజరైనట్లు సర్కారుకు యాజమాన్యాలు తప్పుడు లెక్కలు ఇచ్చాయని ఆరోపించారు. కాగా, అనేక కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలిసింది. సీట్లు కొనుగోలు చేసిన విద్యార్థులకు కొన్ని కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వారికి అక్కడి ఇన్విజిలేటర్లు సహకరించారన్న విమర్శలున్నాయి. అంతా గోప్యంగా, ఏమాత్రం బయటకు పొక్కకుండా పకడ్బందీ వ్యూహంతో పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. పకడ్బందీగా నిర్వహించాం ఎం-సెట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 11 కేంద్రాల్లో పరీక్ష జరిగిందని, మొత్తం 5,130 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష ప్రాథమిక కీని విద్యార్థులకు ఈమెయిల్ చేసినట్లు చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే గురువారం సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయవచ్చన్నారు. శుక్రవారం ఫలితాలను, తుది కీని విడుదల చేస్తామని వెల్లడించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను, ఇతర సమాచారాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.