ఎంసెట్‌పై పూర్తి వివరాలు 3న!
మే 10న ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడిసిన్ పరీక్ష
కాకినాడ: ఏపీలో ఎంసెట్-2015 పరీక్ష మే 10న జరగనుందని, పూర్తి వివరాలను మార్చి 3న వెల్లడిస్తామని ఎంసెట్ నిర్వహణ కమిటీ చైర్మన్, జేఎన్టీయూకే ఇన్చార్జి వీసీ డాక్టర్ బి.ప్రభాకరరావు తెలిపారు. మే 10న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ అభ్యర్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడిసిన్ అభ్యర్థులకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ మేరకు జేఎన్టీయూకేలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకునేందుకుగాను ఎంసెట్ కమిటీ మార్చి 2న హైదరాబాద్‌లో భేటీకానున్నట్టు ప్రభాకరరావు వెల్లడించారు. ఏపీ ఉన్నత విద్యామండలి ైచైర్మన్ వేణుగోపాల రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ ప్రకాష్, కార్యదర్శి కృష్ణమూర్తి, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లతో చర్చించాక పూర్తి వివరాలను మార్చి 3న వెల్లడిస్తామన్నారు. ఎంసెట్ నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 407 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 2.5 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతారని అంచనా వేసినట్టు చెప్పారు.