ఆగిన చక్రాలు.. ఆగని పరీక్షలు
- నేడు ఎంసెట్..రేపటి నుంచి డీఎస్సీ
- ఏకకాలంలో జిల్లాలో 45 వేల మంది అభ్యర్థుల తాకిడి
- ఇతర జిల్లాలకు వెళ్లే అభ్యర్థుల్లో ఆందోళన
చిత్తూరు (అర్బన్): కొలువు కోసం కొందరు.. చదువుల కోసం మరికొందరు. ఎవరైనా సరే పరీక్షలు మాత్రం తప్పనిసరి. పరీక్షలు రాయాల్సిన వేలాది మంది అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆందోళన. పరీక్షలు బాగా రాస్తామో.. రాయమోనని కాదు.. అసలు పరీక్షలకు హాజరవుతామా..? అని. శుక్రవారం ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత నిరుద్యోగులు ఎదురు చూస్తున్న డీఎస్సీ పరీక్షలు శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె అభ్యర్థులను, విద్యార్థులను మానసిక ఒత్తిడిలో పడేస్తోంది.
ఎంసెట్ పరీక్షలకు రాయలసీమ రీజియన్ నుంచి 17,001 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షలను శుక్రవారం తిరుపతిలోని 27, చిత్తూరులోని 7 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడికల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. నిర్ణీత సమయంలోపు ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటామా అనే దానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రైవేటు వాహనాలను మాట్లాడుకుని గురువారం రాత్రికే తిరుపతి, చిత్తూరు నగరాలకు చేరుకున్నారు. కొంతమంది మాత్రం ప్రయాణాన్ని శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. ఇక ఎంతోకాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న డీఎస్సీ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్, భాషా పండితులు, పీఈటీలకు ఈనెల 9 నుంచి 11 వరకు జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 37,782 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలన్నీ తిరుపతిలోనే జరగనుండటంతో ఇక్కడ 171 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
జిల్లాలో బయాలజికల్ సైన్స్‌తో పాటు పలు పోస్టులు డీఎస్సీలో భర్తీ చేయకపోవడంతో నాన్‌లోకల్ కింద కడప, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరీక్షలు రాయడానికి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లంతా సమయానికి ఆయా జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం సవాల్‌గా మారనుంది. ఆర్టీసీ సమ్మెతో పలు ప్రాంతాలకు నడిచే రైళ్లలో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతుండగా, స్లీపర్ క్లాస్‌లో వెయింటింగ్ లిస్టు వేలలో చూపిస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య విద్యార్థులు, నిరుద్యోగులు నిజమైన పరీక్షను ఎదుర్కోనున్నారు.