Earthquake rumors
-
భూకంపం వస్తోందని వదంతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భూ కంపం వదంతులతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తెల్లవార్లూ రోడ్లపైనే గడిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటల ప్రాంతం లో భూకంపం వస్తోందని వదంతులు వ్యాపించాయి. బంధువులు, తెలిసినవారి నుంచి ఫోన్లు రావడంతో నిద్రలో ఉన్నవారు గాబ రాతో పిల్లాపాపలను తీసుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మహారాష్ర్ట నుంచి జిల్లాకు భూకంపంపై పుకార్లు షికార్లు చేసినట్లు తెలుస్తోంది. ముంబ యి, భీవండి, పూణె, జాల్నా, నాందేడ్ తదితర ప్రాం తాలలో స్థిరపడిన తెలుగువారు ఇక్కడి బంధువులకు ఫోన్ చేసి భూకంపం వదంతులపై సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలోని కొన్నిచోట్ల మంగళవారం రాత్రి పదిగంటల వరకు కూడా సాగింది. అలసి, సొలసి నిద్రిస్తున్న వేళ పొద్దంతా పనిచేసిన ఎన్యూమరేటర్లు, వివరాల నమోదు కోసం ఇళ్లను వదలకుండా ఎదురు చూసిన ప్రజలు అలసిపోయి నిద్రిస్తున్న వేళ వచ్చిన ఫోన్లు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. జనాలు తెల్లవార్లూ జాగారం చేయాల్సి వచ్చింది. యువకులు బైకులు తీసుకొని రోడ్లపైకి వచ్చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలలోని చా య్ హోటళ్ల వద్ద చాలా మంది టైంపాస్ చేస్తూ బంధు, మిత్రులకు ఫోన్లు చేశారు. భూకంపం పుకారు విదేశాలను సైతం తాకాయి. ప్రవాస భారతీయులు జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతానికి ఫోన్ చేసి తమ వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇక్కడి బంధువుల కు ఫోన్లు వచ్చాయి. బాల్కొండ, భీమ్‌గల్, బిచ్కుంద, నిజాంసాగర్, లింగంపేట, డిచ్పల్లి, కమ్మర్పల్లి, నాగిరెడ్డిపేట, వర్ని,నందిపేట, మాచారెడ్డి, మండలాల్లో భూకంప వదంతులు భయపెట్టాయి. బోధన్ శక్కర్‌నగర్‌లో పలు కాలనీలలో ప్రజలను నిద్ర లేపడానికి యువకులు పటాకులు కాల్చారు. మరికొన్ని కాలనీలలో వార్డు కౌన్సిలర్లు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను నిద్రలేపారు. భిక్కనూరు మండలంలో గల్ఫ్ దేశాల నుంచి ఫోన్ చేస్తూ తమ వారిని భూకంపంపై హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గం లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ నుంచి వదంతులు వ్యాపిం చినట్లు కూడా చెబుతున్నారు. -
భూకంపం వదంతులు
భైంసా రూరల్ : నిజామాబాద్ జిల్లాలో అప్పుడే పుట్టిన శిశువు భూ కంపం వస్తుందని చెప్పి కన్నుమూసిందని, మహారాష్ట్రలో భూకంపం వచ్చిందని, ఇక్కడ కూడా రాబోతోందనే వదంతులతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మంగళవారం ఉదయం నుంచి సమగ్ర కుటుంబ సర్వేలో బిజీగా గడిపిన ప్రజలు ఈ వదంతులతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి వేళ ఫోన్‌కాల్స్ ఏమిటని లిఫ్ట్ చేసిన ప్రజలు భూకంపం రానుందని అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని షాక్‌కు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలైన ఈ వదంతులు వివిధ మండలాలకు క్షణాల్లో దా వానంలా వ్యాపించాయి. సమాచారం అందడమే ఆలస్యం అన్నట్లుగా.. అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. జాగారం.. సర్వే పుణ్యమా అని స్థానికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సంతోషంగా గడిపారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వ్యాపించిన భూకంప వదంతులు అందరినీ భయకంపితులను చేశాయి. ఒంటి గంటకు ప్రారంభమైన ఈ పుకార్లు నాలుగు గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అధికశాతం ప్రజలు రోడ్లపైకి వచ్చి జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంతోపాటు గ్రామాల్లోనూ ప్రజలు వేకువజాము వరకు జాగారం చేశారు. మరికొందరు ఆలయాల్లో పూజలు చేసి కాపాడాలని ఇష్టదైవాన్ని వేడుకున్నారు. వాడవాడలా ప్రజలు గుంపులుగా ఏర్పడి చర్చించుకున్నారు. ఫోన్లలో సమాచారం చేరవేత.. భూకంపం వచ్చిందనే వదంతులు వివిధ ప్రాంతాలకు వ్యా పించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా ప్రతిఒక్కరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్, ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులను సైతం ఆరా తీశారు. మరికొందరు సమాచారం తెలుసుకునేందుకు వేకువజాము వరకు టీవీలకు అతుక్కుపోయారు. అయితే ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెల్లారేసరికి ఆ వార్త పుకారేనని తెలిసిన జనం అజ్ఞాత వ్యక్తిని తిట్టుకుంటూ ఇళ్లలోకి వెళ్లారు. గతంలోనూ... గతంలోనూ ఇలాంటి వదంతులు నిర్మల్ వాసులను తీవ్ర కలవరపెట్టాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని ఓ గుడిలో పూజా రి పూజలు చేస్తూ మృతిచెందాడని, అంతకుముందు భూకం పం వస్తుందని చెప్పాడంటూ వచ్చిన పుకార్లు ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేసింది. చివరకు అవన్నీ వదంతులేనని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
తెలంగాణ జిల్లాల్లో భూకంప వదంతులు