‘పప్పు ధరలు ఎక్కువైతే చికెన్ తినండి’
ఇస్లామాబాద్: పాకిస్థానీయులు పప్పుల ధరలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే చికెన్ తినాలని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సెలవిచ్చారు. పప్పుల ధరలు ఆకాశాన్నంటాయని విపక్షాలు చేస్తున్న ఆందోళనపై ఆయన స్పందించారు.
'ప్రస్తుతం పప్పుల ధరలు కేజీ రూ.260 ఉన్నాయని విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. చికెన్ కేజీ రూ.200కే దొరుకుతోందనీ, దాన్నే తినాలని ప్రజలకు చెప్పాల'ని ఇషాక్ ప్రతిపక్షానికి బదులిచ్చారు.
తమ ప్రభుత్వం ద్రవ్యలోటును 8.8 నుంచి 4.3 శాతానికి తగ్గించిందనీ, అభివృద్ధిపై వ్యయాన్ని రెట్టింపు చేసిందని ఆయన చెప్పారు. అభివృద్ధికి రెండింతల నిధులు కేటాయించామన్నారు. ప్రజల సాధికారత కోసం పాటు పడుతున్నామని, రుణాలపై ఆధారపడడం తగ్గిస్తున్నామని చెప్పుకొచ్చారు.