కోక్ కోసం కోటీ యాభై ఆరు లక్షలు..!
ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ ఓన్లీ కోకాకోలా అంటూ ఒకప్పుడు అందర్నీ ఉర్రూతలూగించిన యాడ్ గుర్తుందా? ఈ ఫొటోలో కోక్ కేన్ల పక్కన నిలబడిన మహిళకు ఆ యాడ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈమె.. కోక్ తప్ప మరోటి అవసరం లేనంతగా ఆ శీతలపానీయానికి అంకితమైపోయింది. ఇంగ్లండ్‌లోని ఎల్లిస్మీర్ పోర్టు సమీపంలో ఉండే జక్కీ బల్లాన్కు డైట్ కోక్ అంటే పిచ్చి! రోజుకు కనీసం 10 లీటర్ల కోక్ ఉండాల్సిందే. ఇందులో ఏ మాత్రం తగ్గినా.. తల తిరగడం, కాళ్లూ చేతులూ వణకడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడిపోతుంది. ఈమె ఇంటి నిండా కోక్ బాటిళ్లే దర్శనమిస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు మనీ అయినా మర్చిపోతుందేమో కానీ, కోక్ బాటిళ్లను మాత్రం మర్చిపోదు.
బల్లాన్ హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ కనీసం అరడజను బాటిళ్లు ఉండాల్సిందే. ఈమె తన 14వ ఏట తొలిసారిగా డైట్ కోక్ తాగిందట. ఇక అప్పటి నుంచి 30 ఏళ్లుగా తాగుతూనే ఉంది. ఓ దశలో అయితే రోజుకు ఏకంగా 16 లీటర్ల కోక్ పట్టించేసేదట. దానివల్ల కొన్ని దుష్ర్పభావాలు కలగడంతో వైద్యుల సూచన మేరకు ఈ మధ్యే దాన్ని 10 లీటర్లకు తగ్గించింది. మొత్తమ్మీద ఇప్పటివరకు కేవలం కోక్ కోసం ఏకంగా కోటీ యాభై ఆరు లక్షల రూపాయలు వెచ్చించింది..!