కేజీబీవీలో విషాహారం..25 మందికి అస్వస్థత
సోంపేట, న్యూస్‌లైన్ : పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయలో గురువా రం రాత్రి విషాహారం తిని 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవటం కలకలం రేపింది. ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స కొనసాగిస్తుండగా మిగిలినవారిని పాఠశాలకు తిరిగి తీసుకెళ్లారు. బాధిత విద్యార్థినులు, కేజీబీవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటలకు అల్పాహారంగా కొమ్ముశెనగలు తిన్నారు. తర్వాత రాత్రి 7 గంటల సమయంలో అన్నం, సాంబారు, మిల్మేకర్ దుంపల కూరతో భోజనం చేశారు. ముందుగా తిన్న 6,7 తరగతుల విద్యార్థినులు కూర బాగోలేదని మిగతావారికి చెప్పారు. అరగంట తర్వాత విద్యార్థినులకు వాంతులు మొదలయ్యాయి. వెంటనే పాఠశాల సిబ్బంది మొదట వాంతులు చేసుకొన్న ఐదుగురిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారికి ఆక్సిజన్ కూడా ఎక్కించారు. తర్వాత మరో 20 మంది కడుపునొప్పిగా ఉందని చెప్పటంతో వారిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 8వ తరగతి విద్యార్థినులు సౌజన్య, రాజేశ్వరి, స్వాతి, దేవి, ఆశ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. మిగతా 20 మందిని పాఠశాలకు తీసుకెళ్లారు. విషాహారం తినటం వలనే అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వైద్యుడు రమేష్‌కుమార్ విలేకరులతో చెప్పారు.కూరకు వినియోగించిన మిల్మేకర్ను డీసీఎంఎస్ వారు సరఫరా చేశారని పాఠశాల ఎస్ఓ టి.కాంతమ్మ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఎప్పట్లాగే మెనూ ప్రకారం ఆహారం వండిపెట్టామని, దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని అన్నారు. మందుగా తిన్నవారు కూర బాగోలేదని చెప్పటంతో తినటం మానేశామని 8వ తరగతి విద్యార్థిని ప్రశాంతి తెలిపింది.