'ఎబోలా' మరింత విస్తృతమయ్యే అవకాశం
పశ్చిమాఫ్రికాను వణుకుపుట్టిస్తున్న ప్రాణాంతకమైన వైరస్ ఎబోలా. ఈ వ్యాధి మరింత విజృంభించే అవకాశాలున్నట్టు వాషింగ్టన్ పరిశోధకులు తమ పరిశోధనలో వెల్లడించారు. మే నెల నుంచి ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 5వేల మంది బలైనట్టు ఇప్పటికే రుజువైందని, ఇది మరింత తీవ్రరూపం దాల్చి విస్తృతంగా వ్యాప్తిచెందే అవకాశముందని పరిశోధక విభాగం హెచ్చరిస్తోంది.
ఇటీవల వైరస్ వ్యాప్తి పెరడంతో మరణాల రేటు 70 శాతానికి చేరినట్టు ఓ కొత్త విశ్లేషణ సూచిస్తోంది. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎబోలా మరణాల రేటు 50 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరానికి ప్రభావిత ప్రాంతాల్లో ఎబోలా బాధితుల సంఖ్య పది లక్షలు దాటే అవకాశమున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఎబోలా వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇతర దేశాలకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.