ఎకో గృహంతో ఎంతో మేలు...!
టిమ్ విల్కాక్స్, అతని భార్య మార్గరెట్ లు నిర్మించిన ఆ భవనం... ఇప్పుడో చిన్న పవర్ స్లేషన్ ను తలపిస్తోంది. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తో కూడిన, సూపర్ ఇన్సెలేటెడ్ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. కరెంటు, వాటర్ బిల్లుల ఖర్చును తగ్గించడమే కాక, పర్యావరణ అనుకూలమైన ఆ భవనం.. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచిపెడుతోంది.
రిటైర్డ్ అకౌంటెంట్ అయిన 66 ఏళ్ళ విల్కాక్స్... స్వీడన్ లోని హౌస్ బిల్డర్ల ద్వారా తెలుసుకున్న ఆలోచనను తన ఇంటికి అమలు చేశారు. అరవైశాతం వాటర్ బిల్ తగ్గించే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ తో పాటు... సూపర్ ఇన్సులేటెడ్ హౌస్ నిర్మాణానికి విల్కాక్స్ దంపతులు సుమారు 500,000 యూరోలు ఖర్చు చేశారు. ఇంటి నిర్మాణంలో వెంటిలేషన్ కూడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో.. చెడు గాలిని బయటకు పంపి, శుభ్రమైన గాలిని లోపలకు తెచ్చే అవకాశం కూడ ఉంది. శీతాకాలంలో హీటర్లతో వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా నిర్మించిన ఆ భవనం... నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం కూడ పాలుపంచుకుంది. ఎకో గృహ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 1,500 యూరోలను నేషనల్ గ్రిడ్ అందించింది.
ఆ భార్యాభర్తలు నిర్మించిన పర్యావరణ అనుకూల గృహం..ఇప్పుడు ఆ ఇంటికంతకీ విద్యుత్తును అందించే ఓ చిన్న పవర్ స్టేషన్ గా మారింది. ఆ ఇంట్లో రెండు రకాల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. సోలార్ పవర్ తో పాటు, ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ళద్వారా వేడినీళ్ళతో విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. గతేడాది మొత్తం పన్నెండు నెలల్లో ఉత్పత్తిచేసిన 706.40 యూరోల విద్యుత్తునుంచి ఈ దంపతులు 292.87 యూరోల గ్యాస్, 413.53 యూరోల విద్యుత్తు వినియోగించుకున్నారు. మిగిలిన విద్యుత్తును సప్లై చేయడం ద్వారా నేషనల్ గ్రిడ్ అధికారులనుంచి 147 యూరోలను కూడ అందుకోగలిగారు. అంతేకాదు.. వీరికి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా పోయింది. ఈ ఎకో హౌస్ లోని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా ఐదు వేల లీటర్ల ట్యాంక్ నిండుతుంటుంది. ఈ నీటిని వీరు టాయిలెట్లలో ఫ్లషింగ్ కు వాడుతున్నారు. దీంతో వాటర్ బిల్లులు కూడ 60 శాతం తగ్గిపోయాయి.
సూపర్ ఇన్సులేట్ గోడలు, పైకప్పుతోపాటు, పది అంగుళాల మందపాటి పాలీస్టైరిన్ ప్యానెళ్ళు ఉపయోగించి ఈ పర్యావరణ గృహాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో వెంటిలేషన్ ద్వారా పాతగాలి బయటకు పంపి, కొత్త.. శుభ్రమైన గాలిని లోపలికి తెచ్చే ఓ ప్రసరణ వ్యవస్థ కూడ ఉంది. ఇకపై గృహ నిర్మాణాలు ఇదే పద్ధతిలో కొనసాగితే.. కొత్తగా విద్యుత్ కేంద్రాల స్థాపనే అవసరం ఉండదని విల్కాక్స్ అంటున్నారు. ట్రాంక్విల్లిటీలుగా పిలిచే ఈ గృహాల నిర్మాణానికి రెండేళ్ళ సమయం పడుతుంది. ఈ నిర్మాణం పూర్తయ్యే సరికి 520.000 యూరోలు ఖర్చయినా... ఇప్పుడు ఈ గృహం ఖరీదు 800.000 యూరోలు విలువ చేస్తోంది. ఏ రకంగా చూసినా ఈ ఎకో హోమ్ వల్ల లాభమే ఉంటుందని విల్కాక్స్ అంటున్నారు. అంతేకాక డబ్బు కూడ పొదుపు అవుతుందని చెప్తున్నారు.