పోలీస్ తలుపు తట్టండి
కొత్త ఎస్పీ రఘురామిరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఆస్పత్రికి ఎలా వెళ్తారో.. కష్టాల్లో ఉన్న బాధితులు ధైర్యంగా పోలీ స్ స్టేషన్ గడప తొక్కాలి. న్యాయం కలిగిందన్న భరోసా తో తిరిగి వెళ్లాలి. ప్రజల్లో పోలీసులపై ఆ నమ్మకం కలిగేవిధంగా నా పనితీరు ఉంటుంది’ అన్నారు కొత్త ఎస్పీ ఎస్.రఘురామిరెడ్డి. కర్నూలు నుంచి ‘పశ్చిమ’కు బదిలీ అరుున ఆయన ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ఈ వారంలో తాను ఇక్కడ బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. వీలైనంత త్వరగా పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రధానంగా ఆర్థిక నేరాల అదుపుపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతల సమస్య, ఫ్యాక్షన్ నేపథ్యం లేనప్పటికీ ఆర్థిక నేరాలు, వైట్కాలర్ నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. వీటిపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. తన విద్యాభ్యాసం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందని, ఉభయగోదావరి జిల్లాల్లోని పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. తన స్థానంలో కర్నూలుకు బదిలీ అయిన రవికృష్ణ ప్రస్తుతం శాఖాపరమైన శిక్షణలో భాగంగా జైపూర్లో ఉన్నారని తెలిపారు. ఆయన వచ్చేందుకు మూడు, నాలుగు రోజులు పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వేడుకలను ఈసారి కర్నూలులో నిర్వహిస్తోందని, ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నానని వెల్లడించారు. కర్నూలు ఎస్పీగా నియమితులైన రవికృష్ణ రాగానే అక్కడి బాధ్యతలను ఆయనకు అప్పగించి, పశ్చిమగోదావరి జిల్లాకు వస్తానని రఘురామిరెడ్డి పేర్కొన్నారు.