Economic relations
-
భారత్–ఆస్ట్రేలియా బంధం విద్యార్థులకు వరం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల పటిష్టత విద్యార్థులకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పించనుందని వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో ప్రస్తుత, భవిష్యత్ భారత్ సంబంధాల్లో విద్య ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుందని ఆయన అన్నారు. ‘‘రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు విస్తరిస్తున్నందున, విద్యార్థులకు అవకాశాలు కూడా సహజంగా పెరుగుతాయి. మేము ఈ దిశలో ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము’’ అని న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యూ) విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. భారత్‌కు చెందిన దాదాపు లక్ష మంది ఆస్ట్రేలియా వెళ్లి విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం క్లుప్తంగా... విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి విద్యలో భారతదేశం–ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇందుకు వీలుగా భారత్‌లో న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కార్యకలాపాలను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సేవల రంగాన్ని రెండు దేశాలూ పరస్పరం విస్తరించుకోవాలని కోరుకుంటు న్నాము. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మరింత బలపడుతున్నాయి. స్టార్టప్‌లలో కూడా వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నందున, మీ అందరి (ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులు) సహకారం మరింత అవసరం అవుతుంది. విద్యార్థులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య విద్య వారధిగా పనిచేస్తుంది. విద్య ఎల్లప్పుడూ రెండు దేశాల భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశం. కోవిడ్ అనంతర ప్రపంచంలో, మనం వృద్ధికి సంబంధించి అధునాతన విధానాలను అన్వేషించాలి. ఇందులో భాగంగా ఎన్ఎస్డబ్ల్యూ భారత్‌లో తన కార్యకలాపాలను పెంచాలి. ఉపాధికీ అవకాశాలు: ఆస్ట్రేలియన్ మంత్రి టెహాన్ ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ వాణిజ్య మంత్రి డాన్ టెహన్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఇక్కడ పని చేసే విషయంలో కొంత తర్జన భర్జనలు పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి సందేహాలకు తావు లేదని ఆయన అన్నారు. ‘‘రెండు దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా, మేము ఒక కీలక నిర్ణయం తీసుకున్నాము. ఒక విద్యార్థి ఎస్టీఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) డిగ్రీ తీసుకున్నట్లయితే అలాగే డిగ్రీలో భాగంగా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో పని చేస్తున్నట్లయితే అప్పుడు ఆ విద్యార్థి అదనపు పోస్ట్ స్టడీ వర్క్ వీసా పొందుతాడు. అలా సంబంధిత విద్యార్థి ఇక్కడే ఉండగలడు. పని చేయగలడు. ఎక్కువ కాలమూ తన సేవలను అందించగలడు’’ అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో విద్య ఉపాధి అవకాశాలను అంది స్తుందని తాము ఖచ్చితంగా చెప్పగలమని పేర్కొన్నారు. అలాగే రాబోయే ఆరు నెలల్లో, భారత్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తాము ఆశిస్తున్నామనీ ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో ఫైనాన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ చదువుతున్న ముష్కాన్ అనే భారతీయ విద్యార్థిని అంతకుముందు ఒక ప్రశ్న అడుగుతూ, ‘‘నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా (ఇక్కడ), మీరు ఆస్ట్రేలియన్ పౌరుడు లేదా ఆస్ట్రేలియన్ టీఆర్ (తాత్కాలిక నివాసి) అయి ఉండాలనే నిబంధన ఎప్పుడూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోతున్నాను. ఇది నిజంగా నిరుత్సాహపరుస్తుంది’’అని అన్నారు. అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యం... సంబంధాల వారధి భారత్–ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య సంబంధాల పురోగతి వల్ల విద్య, సాంస్కృతిక వంటి ఇతర అన్ని రంగాల మధ్య భాగస్వామ్యం మరింత పటిష్టమవుతుందని బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్వహించిన బిజినెస్ లీడర్స్ మీటింగ్‌ను ఉద్దేశించి గోయల్ అన్నారు. ‘‘వివిధ రంగాలకు సంబంధించి మీరు (ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు) మీ సాంకేతికతలను భారత్‌కు తీసుకోవచ్చు. భారత్‌లో ఈ టెక్నాలజీని విస్తరించవచ్చు. ఆస్ట్రేలియా అద్భుతమైన ఆవిష్కరణలను, ప్రయోగ ఫలితాలను.. పరిశోధనా సంస్థలు లేదా విశ్వవిద్యాలయాల నుండి భారతదేశం వంటి పెద్ద మార్కెట్‌కు తీసుకెళ్లవచ్చు. ఆయా అంశాలకు సంబంధించి భారతీయులు ప్రదర్శించే ప్రతిభ, నైపుణ్యాలను మీరూ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాను ప్రస్తావించదలచాను. మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశ పురోగతి కోసమే ఉద్దేశించినది కాదు. ఈ ప్రయోజనం ప్రపంచ దేశాలకూ అందాలన్నది మా సంకల్పం’’ అని గోయల్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ప్రయోజనం గణనీయంగా పొందడానికి భారతదేశం ప్రత్యేకంగా ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. అలాగే కొన్ని నెలల్లో ఆస్ట్రేలియాలో ట్రేడ్ ప్రమోషన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తుందని గోయల్ సూచించారు. భారత్‌లో పెట్టుబడులు పెడితే, మెరుగైన రాబడులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. 27.5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక స్నేహం భారత్–ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యా న్ని ప్రస్తుతం 27.5 బిలియన్ డాలర్లు. ఈ పరిమాణాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై రెండు దేశాలూ దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఈ నెల రెండవతేదీన రెండు దేశాలు ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని (స్వేచ్ఛా వాణిజ్యం) కుదుర్చుకున్నాయి. దీని కింద ఇరు దేశాలు 85–96 శాతం ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్‌లు ఎత్తివేయనున్నాయి. విద్య, పరిశోధన, స్టార్టప్‌లు, అగ్రి టెక్ విభాగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు రెండు దేశాలూ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఈ నెల 4న భారత్ వాణిజ్య మంత్రి గోయల్ మూడు రోజుల కీలక పర్యటన ప్రారంభమైంది. వ్యూహాత్మక భద్రతా చర్చలకు సంబంధించి (చైనా ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా అని కొందరు విశ్లేషి స్తారు) నాలుగు దేశాల క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్యూఎస్డీ– కొన్నిసార్లు క్యూ యూఏడీ అని కూడా పిలుస్తారు) సభ్య దేశా ల్లో భారత్–ఆస్ట్రేలియాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు జపాన్, అమెరికాలకు క్వాడ్‌లో సభ్యత్వం ఉంది. క్వాడ్‌లో సభ్యదేశమైనప్ప టికీ, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ రష్యాకు మద్దతు నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో కీలక స్వేచ్ఛా వాణిజ్యానికి తెరతీయడం గమనార్హం. -
భారత్–యూఏఈ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు ఒక వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్వేగా ఉండడం మరో కీలక అంశం. స్మారక స్టాంప్ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశాయి. అపార వాణిజ్య అవకాశాలు ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి. – పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి -
ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికవడాన్ని భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడగలదని ఆకాంక్షించాయి. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల బంధాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటి ఉమ్మడి ఎజెండా అమలుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ తెలిపారు. ‘బైడెన్–కమలా సారథ్యంలో భారత్–అమెరికా ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడగలవు. అధునాతన శాస్త్రీయ పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, వ్యూహాత్మక రంగాల్లో వ్యాపార వర్గాల మధ్య సహకారం పెరగగలదు‘ అని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య పటిష్టమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని .. ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ చెప్పారు. నాయకత్వం అంటే విధానాలతో పాటు వ్యక్తిత్వం కూడా అన్న పాఠాన్ని అమెరికా ఎన్నికలు తెలియజేశాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2019లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 150 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పరస్పర ఆర్థిక సహకారంతో దీన్ని 500 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. స్వాగతించిన ఐటీ పరిశ్రమ..: జో బైడెన్ ఎన్నికపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హర్షం వ్యక్తం చేసింది. ‘స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి చర్యల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భార త టెక్నాలజీ రంగం కీలక తోడ్పాటు అందిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాల్లో అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై నాస్కామ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది‘ అని పేర్కొంది. ‘ఇది చారిత్రకమైన రోజు. అవరోధాలన్నీ తొలగిపోవడం హర్షించతగ్గ పరిణామం. ఏకత్వానికి, సమిష్టి తత్వానికి ఇది గెలుపు‘ అని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది‘ అని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్ణానీ ట్వీట్ చేశారు. -
అమెరికాతో అంటకాగితే అంతే సంగతులు!
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచీ, తన విదేశాంగ విధానాన్ని అమెరికాతో భారత్‌కి మరింత సాన్నిహిత్యాన్ని పెంచే దిశగానే నడిపించింది. ముఖ్యంగా, రక్షణ పరంగా ఈ భాగస్వామ్యం పెద్దగంతులలో అభివృద్ది చెందింది. ఈ క్రమంలోనే, అమెరికా నుంచి కూడా భారత ప్రభుత్వం తన చొరవలకు తగిన విధమైన సానుకూల స్పందనలను ఆశించింది. అలాగే, అమెరికా నుంచి ఆయుధాల దిగుమతులను కూడా, మోదీ హయాంలో మరింతగా పెంచారు. గతనుంచే ఇవి పెరుగుతూ వస్తున్నా, మోదీ హయాంలో మరింత వేగం పుంజుకున్నాయి. దీనికి తార్కాణమే 2007 అనంతర కాలం నుంచీ నేటి వరకూ మన ప్రభుత్వాలు అమెరికాతో చేసుకున్న ఆయుధాల కాంట్రాక్టుల మొత్తం 17 బిలియన్ డాలర్లకు పైగా చేరుకోవడం. అలాగే, మన దేశంలోకి పలు రకాల అమెరికా ఉత్పత్తుల దిగుమతులకు మరింత ఆస్కారం కలిగించే విధంగా చర్యలు తీసుకొని అమెరి కాకు మనతో ఉన్న వాణిజ్యలోటును తగించుకోవడంలో కూడా సహకరించింది. కాగా, గతంలో భారత్ జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన ఎమ్.కె నారాయణన్ వంటివారు కూడా అమెరికాతో అతి సాన్నిహిత్యం, నేటి పరిస్థితులలో తగదని గతం నుంచీ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే వచ్చారు! ఇలాంటి వారి సలహా లను పెడచెవిన పెట్టిన ఫలితం, నేడు మెల్లగా కళ్లముందు ఆవిష్కృతమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తన దేశ వాణిజ్య లోటును తగ్గించుకునే క్రమంలో భారత్‌పైన కూడా ఒత్తిడిని, దాడిని పెంచుతున్నారు. ఒక వైపున భారత్‌ను డిమాండ్ చేసి మరీ హార్లీ డేవిడ్సన్ బైక్లవంటి వాటిపై మన దేశం విధిస్తోన్న సుంకాలను తగ్గింపచేసుకుంటూ, మరో ప్రక్కన భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతోన్న స్టీలు, అల్యూమినియం వంటి ఉత్పత్తుల మీద సుంకాలను పెంచేశాడు. అలాగే భారత్ నుంచి కూడా 1974 నుంచి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద ‘సున్నా’ శాతం సుంకాలతో ఎగుమతి అవుతోన్న 2000 రకాల సరకులకు ఆ సదుపాయాన్ని తొలగించాడు. దీని వలన, ఈ పద్ధతి క్రింద 2018లో అమెరికాకు సుమారు వి6 బిలియన్ల మేర ఎగుమతులను చేసిన భారత్‌పై నేడు అదే ఎగుమతులకు గాను అదనంగా సుమారు 190 మిలియన్ డాలర్ల సుంకాల భారం పడనుంది. దీనితో, మన ఎగుమతులలో కొన్ని అమెరికాలో ఖరీదైనవిగా మారి, అవి ఇతర దేశాల సరుకుల పోటీని తట్టుకోలేని స్థితి వస్తుంది. ఇదంతా చాలదన్నట్లు, మన దేశీయ సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తూ ఇరాన్ నుంచి మనం చమురును దిగుమతి చేసుకోవడాన్ని కొనసాగిస్తే, ఆంక్షలు విధిస్తానంటూ అమెరికా బెదిరిస్తోంది. వాటికి లొంగి పోతే మనం, మన చమురు అవసరాల కోసం, ఇతరేతర దేశాలపై ఆధారపడవలసి వస్తుంది. దీనితో చమురు దిగుమతులకోసం మనం అధిక వ్యయాన్ని చేయాల్సి వస్తుంది. ఫలితంగా మన దేశీయ విదేశీ కరెన్సీ నిల్వలపై ఒత్తిడి పెరిగి, రూపాయి విలువ పతనానికి దారి తీస్తుంది. దాంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగటంతోపాటుగా, ఇతరేతర సరుకుల ధరలు కూడా పెరిగిపోతాయి. మన ప్రభుత్వం గత సంవత్సరంలో రష్యాతో చేసుకున్న యస్ 400 మిసైల్ రక్షణ వ్యవస్థల దిగుమతుల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోమంటూ అమెరికా మనపై ఒత్తిడి తెస్తోంది. అయితే నాటోలో సభ్యత్వం కలిగివున్న టర్కీ ఈ ఒత్తిళ్ళను బేఖాతరు చేసి వచ్చే నెలలోనే ఈ మిసైల్స్‌ని దిగుమతి చేసుకుంటోంది. మా ఇంటికొస్తే ఏం తెస్తావు? మీ ఇంటికొస్తే ఏం ఇస్తావు? తరహాగా ఉన్న అమెరికా ధోరణికి ఇకనైనా అడ్డుకట్ట వేయటం మన దేశానికి తక్షణ ఆగత్యం. ఇప్పటికే భారత ప్రభుత్వం తీసుకుంటోన్న కొన్ని దిద్దుబాటు చర్యలు కొంత ఆశను కలిగిస్తున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ నేపథ్యంలో మనం అమెరికాకి దూరంగా చైనా, రష్యా వంటి అంతర్జాతీయ స్వేచ్ఛావాణిజ్యాన్ని కోరుకుంటోన్న దేశాలతో దగ్గరగా జరగవలసి ఉంది. దీనిలో భాగంగానే మోదీ మళ్లీ దేశ ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలో మనం చైనాను నొప్పించకుండా జాగ్రత్త తీసుకుంటూ ఆ ప్రమాణస్వీకారోత్సవానికి టిబెట్, తైవాన్‌ల ప్రతినిధులను ఆహ్వానించకపోవడం గమనార్హం. అలాగే, షాంఘై సహకార సంస్థ సమావేశంలో మోదీ చైనా నేత జి, రష్యా నేత పుతిన్‌తో జరిపిన చర్చలు కూడా మూడు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు నెలకొనే దిశగానే ఉన్నాయని వార్తలు. ఇటువంటి చొరవల ద్వారా మాత్రమే తన ఆర్థిక సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించుకొనేందుకు భారత్‌తో మైత్రి పేరిట భారత్ మార్కెట్లను ఏకపక్షంగా కొల్లగొట్టే అమెరికా ఎత్తుగడలకు మనం చెక్పెట్టగలం. మన పాలకులు గనుక అమెరికాతో తమ పీఠముడిని బద్దలు చేసుకొని, దేశీయ ప్రయోజనాలను కాపాడుకొనే దిశగా చర్యలు తీసుకోకుంటే అది అతిమంగా దేశీయ ప్రజల ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా పరిణమించగలదు. ఇలాంటి ముప్పును తెచ్చిపెట్టే, అమెరికాతో సాగుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మనకు చెరుపే చేస్తుంది. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం
బ్రూనై: ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో ఆర్థిక సంబంధాలు మెరుగుదల కోసం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రకటించారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని గురువారం బ్రూనైలో జరిగిన 11వ భారత్-ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఈ ఏడాది ‘మన ప్రజలు, మన భవిష్యత్తు’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఆసియాన్ సభ్య దేశాల అధినేతలు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆసియాన్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి మన్మోహన్ కొత్త కార్యాచరణను ప్రకటించారు. సదస్సులో మన్మోహన్ ప్రసంగిస్తూ... ఆసియాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించేలా సేవలు, పెట్టుబడుల రంగంలో ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని, ఇది వచ్చే ఏడాది అమలులోకి వస్తుందన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాణిజ్యం ప్రస్తుతం ఉన్న 76 బిలియన్ డాలర్ల నుంచి 2015 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని, అలాగే 2022 నాటికి రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆసియాన్-ఇండియా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) చర్యలు కూడా ప్రారంభించిందని చెప్పారు. తమ ‘లుక్ ఈస్ట్’ విధానంలో ఆసియాన్ దేశాలతో సంబంధాలు మైలురాయి వంటివని, వాటితో భాగస్వామ్యం బలపడుతోందని పేర్కొన్నారు. ఆసియాలో ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారానికి ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇండోనేసియా జకార్తాలో ఏర్పాటు చేసే ఈ కార్యాలయంలో ప్రత్యేక రాయబారినీ నియమిస్తామన్నారు. టైజంపై ఉమ్మడిపోరు: ప్రధాని అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్, ఆసియాన్ దేశాలు ఉమ్మడిగా ఒక ప్రణాళికను రూపొందించుకునే ప్రక్రియలో ఉన్నాయని ప్రధాని మన్మోహన్ చెప్పారు. ఇప్పటికే ఇరు వర్గాలు మధ్యా సహకారానికి సంబంధించి ఎనిమిది కీలక అంశాలను గుర్తించినట్టు చెప్పారు. భారత్-ఆసియాన్ దేశాల మధ్య ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ఒప్పందానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఇది 2015 నాటికి ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందని మన్మోహన్ స్పష్టం చేశారు. భారత్-ఆసియాన్ మధ్య మ్యారీటైమ్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ గ్రూప్ కూడా త్వరలోనే ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-ఆసియాన్ మధ్య బంధం మరింత బలపడేందుకు రాకపోకలు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇందు లో భాగంగా భారత్-మయన్మార్-థాయ్‌లాండ్‌లను కలుపుతూ త్రైపాక్షిక రహదారుల నిర్మాణం చివరి దశకు చేరుకుందని, ఈ హైవేను లావోస్, కంబోడియా, వియత్నాంకు విస్తరించాలని భావిస్తున్నట్టు చెప్పారు. మన్మోహన్ చేసిన పలు కీలక ప్రతిపాదనలను ఆసియాన్ దేశాలు స్వాగతించాయి. ఆసియాన్ కూటమిలో బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్, లావోస్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం ఉన్నాయి.