అమెరికాతో అంటకాగితే అంతే సంగతులు! | Article On India US Economic Relations | Sakshi
Sakshi News home page

అమెరికాతో అంటకాగితే అంతే సంగతులు!

Published Tue, Jun 25 2019 1:18 AM | Last Updated on Tue, Jun 25 2019 1:18 AM

Article On India US Economic Relations - Sakshi

నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచీ, తన విదేశాంగ విధానాన్ని అమెరికాతో భారత్‌కి మరింత సాన్నిహిత్యాన్ని పెంచే దిశగానే నడిపించింది. ముఖ్యంగా, రక్షణ పరంగా ఈ భాగస్వామ్యం పెద్దగంతులలో అభివృద్ది చెందింది. ఈ క్రమంలోనే, అమెరికా నుంచి కూడా భారత ప్రభుత్వం తన చొరవలకు తగిన విధమైన సానుకూల స్పందనలను ఆశించింది. అలాగే, అమెరికా నుంచి ఆయుధాల దిగుమతులను కూడా, మోదీ హయాంలో మరింతగా పెంచారు. గతనుంచే ఇవి పెరుగుతూ వస్తున్నా, మోదీ హయాంలో మరింత వేగం పుంజుకున్నాయి. దీనికి తార్కాణమే 2007 అనంతర కాలం నుంచీ నేటి వరకూ మన ప్రభుత్వాలు అమెరికాతో చేసుకున్న ఆయుధాల కాంట్రాక్టుల మొత్తం 17 బిలియన్‌ డాలర్లకు పైగా చేరుకోవడం. అలాగే, మన దేశంలోకి పలు రకాల అమెరికా ఉత్పత్తుల దిగుమతులకు మరింత ఆస్కారం కలిగించే విధంగా చర్యలు తీసుకొని అమెరి కాకు మనతో ఉన్న వాణిజ్యలోటును తగించుకోవడంలో కూడా సహకరించింది. కాగా, గతంలో భారత్‌ జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన ఎమ్‌.కె నారాయణన్‌ వంటివారు కూడా అమెరికాతో అతి సాన్నిహిత్యం, నేటి పరిస్థితులలో తగదని గతం నుంచీ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే వచ్చారు! ఇలాంటి వారి సలహా లను పెడచెవిన పెట్టిన ఫలితం, నేడు మెల్లగా కళ్లముందు ఆవిష్కృతమవుతోంది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తన దేశ వాణిజ్య లోటును తగ్గించుకునే క్రమంలో భారత్‌పైన కూడా ఒత్తిడిని, దాడిని పెంచుతున్నారు. ఒక వైపున భారత్‌ను డిమాండ్‌ చేసి మరీ హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌లవంటి వాటిపై మన దేశం విధిస్తోన్న సుంకాలను తగ్గింపచేసుకుంటూ, మరో ప్రక్కన  భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతోన్న స్టీలు, అల్యూమినియం వంటి ఉత్పత్తుల మీద సుంకాలను పెంచేశాడు. అలాగే భారత్‌ నుంచి కూడా  1974 నుంచి జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌  ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ కింద  ‘సున్నా’ శాతం సుంకాలతో ఎగుమతి అవుతోన్న 2000 రకాల సరకులకు ఆ సదుపాయాన్ని తొలగించాడు. దీని వలన, ఈ పద్ధతి క్రింద 2018లో అమెరికాకు సుమారు వి6 బిలియన్ల మేర ఎగుమతులను చేసిన భారత్‌పై నేడు అదే ఎగుమతులకు గాను అదనంగా సుమారు 190 మిలియన్‌ డాలర్ల సుంకాల భారం పడనుంది. దీనితో, మన ఎగుమతులలో కొన్ని అమెరికాలో ఖరీదైనవిగా మారి, అవి ఇతర దేశాల సరుకుల పోటీని తట్టుకోలేని స్థితి వస్తుంది. ఇదంతా చాలదన్నట్లు, మన దేశీయ సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తూ  ఇరాన్‌ నుంచి మనం చమురును దిగుమతి చేసుకోవడాన్ని కొనసాగిస్తే, ఆంక్షలు విధిస్తానంటూ అమెరికా బెదిరిస్తోంది. వాటికి లొంగి పోతే  మనం, మన చమురు అవసరాల కోసం, ఇతరేతర దేశాలపై ఆధారపడవలసి వస్తుంది. దీనితో చమురు దిగుమతులకోసం మనం అధిక వ్యయాన్ని చేయాల్సి వస్తుంది. ఫలితంగా మన దేశీయ విదేశీ కరెన్సీ నిల్వలపై ఒత్తిడి పెరిగి, రూపాయి విలువ పతనానికి దారి తీస్తుంది. దాంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు మరింత పెరగటంతోపాటుగా, ఇతరేతర సరుకుల ధరలు కూడా పెరిగిపోతాయి. 

మన ప్రభుత్వం గత సంవత్సరంలో రష్యాతో చేసుకున్న యస్‌ 400 మిసైల్‌ రక్షణ వ్యవస్థల దిగుమతుల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోమంటూ అమెరికా మనపై ఒత్తిడి తెస్తోంది. అయితే నాటోలో సభ్యత్వం కలిగివున్న టర్కీ ఈ ఒత్తిళ్ళను బేఖాతరు చేసి వచ్చే నెలలోనే ఈ మిసైల్స్‌ని దిగుమతి చేసుకుంటోంది. మా ఇంటికొస్తే ఏం తెస్తావు? మీ ఇంటికొస్తే ఏం ఇస్తావు? తరహాగా ఉన్న అమెరికా ధోరణికి ఇకనైనా అడ్డుకట్ట వేయటం మన దేశానికి తక్షణ ఆగత్యం. 

ఇప్పటికే భారత ప్రభుత్వం తీసుకుంటోన్న కొన్ని దిద్దుబాటు చర్యలు కొంత ఆశను కలిగిస్తున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ నేపథ్యంలో మనం అమెరికాకి దూరంగా  చైనా, రష్యా వంటి అంతర్జాతీయ స్వేచ్ఛావాణిజ్యాన్ని కోరుకుంటోన్న దేశాలతో దగ్గరగా జరగవలసి ఉంది. దీనిలో భాగంగానే మోదీ మళ్లీ దేశ ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలో మనం చైనాను నొప్పించకుండా జాగ్రత్త తీసుకుంటూ  ఆ ప్రమాణస్వీకారోత్సవానికి టిబెట్, తైవాన్‌ల ప్రతినిధులను ఆహ్వానించకపోవడం గమనార్హం. అలాగే, షాంఘై సహకార సంస్థ సమావేశంలో మోదీ చైనా నేత జి, రష్యా నేత పుతిన్‌తో జరిపిన చర్చలు కూడా మూడు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు నెలకొనే దిశగానే ఉన్నాయని వార్తలు.

ఇటువంటి చొరవల ద్వారా మాత్రమే తన ఆర్థిక సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించుకొనేందుకు భారత్‌తో మైత్రి పేరిట  భారత్‌ మార్కెట్‌లను ఏకపక్షంగా కొల్లగొట్టే అమెరికా ఎత్తుగడలకు మనం చెక్‌పెట్టగలం. మన పాలకులు గనుక అమెరికాతో తమ పీఠముడిని బద్దలు చేసుకొని, దేశీయ ప్రయోజనాలను కాపాడుకొనే దిశగా చర్యలు తీసుకోకుంటే అది అతిమంగా దేశీయ ప్రజల ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా పరిణమించగలదు. ఇలాంటి ముప్పును తెచ్చిపెట్టే, అమెరికాతో సాగుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మనకు చెరుపే చేస్తుంది.


డి. పాపారావు 

వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్‌ : 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement