ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం
బ్రూనై: ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో ఆర్థిక సంబంధాలు మెరుగుదల కోసం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని గురువారం బ్రూనైలో జరిగిన 11వ భారత్-ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఈ ఏడాది ‘మన ప్రజలు, మన భవిష్యత్తు’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఆసియాన్ సభ్య దేశాల అధినేతలు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆసియాన్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి మన్మోహన్ కొత్త కార్యాచరణను ప్రకటించారు.
సదస్సులో మన్మోహన్ ప్రసంగిస్తూ... ఆసియాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించేలా సేవలు, పెట్టుబడుల రంగంలో ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని, ఇది వచ్చే ఏడాది అమలులోకి వస్తుందన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాణిజ్యం ప్రస్తుతం ఉన్న 76 బిలియన్ డాలర్ల నుంచి 2015 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని, అలాగే 2022 నాటికి రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆసియాన్-ఇండియా ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) చర్యలు కూడా ప్రారంభించిందని చెప్పారు. తమ ‘లుక్ ఈస్ట్’ విధానంలో ఆసియాన్ దేశాలతో సంబంధాలు మైలురాయి వంటివని, వాటితో భాగస్వామ్యం బలపడుతోందని పేర్కొన్నారు. ఆసియాలో ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారానికి ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇండోనేసియా జకార్తాలో ఏర్పాటు చేసే ఈ కార్యాలయంలో ప్రత్యేక రాయబారినీ నియమిస్తామన్నారు.
టైజంపై ఉమ్మడిపోరు: ప్రధాని
అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్, ఆసియాన్ దేశాలు ఉమ్మడిగా ఒక ప్రణాళికను రూపొందించుకునే ప్రక్రియలో ఉన్నాయని ప్రధాని మన్మోహన్ చెప్పారు. ఇప్పటికే ఇరు వర్గాలు మధ్యా సహకారానికి సంబంధించి ఎనిమిది కీలక అంశాలను గుర్తించినట్టు చెప్పారు. భారత్-ఆసియాన్ దేశాల మధ్య ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ఒప్పందానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఇది 2015 నాటికి ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందని మన్మోహన్ స్పష్టం చేశారు. భారత్-ఆసియాన్ మధ్య మ్యారీటైమ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కింగ్ గ్రూప్ కూడా త్వరలోనే ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్-ఆసియాన్ మధ్య బంధం మరింత బలపడేందుకు రాకపోకలు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇందు లో భాగంగా భారత్-మయన్మార్-థాయ్‌లాండ్‌లను కలుపుతూ త్రైపాక్షిక రహదారుల నిర్మాణం చివరి దశకు చేరుకుందని, ఈ హైవేను లావోస్, కంబోడియా, వియత్నాంకు విస్తరించాలని భావిస్తున్నట్టు చెప్పారు. మన్మోహన్ చేసిన పలు కీలక ప్రతిపాదనలను ఆసియాన్ దేశాలు స్వాగతించాయి. ఆసియాన్ కూటమిలో బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్, లావోస్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం ఉన్నాయి.