తలలో రక్తనాళాలు చిట్లినా అరటన్ను పైకెత్తి..
లండన్: అరటన్ను బరువును పైకెత్తి ప్రముఖ వెయిట్ లిఫ్టర్ ఎడ్డీ హాల్ రికార్డు సృష్టించాడు. అయితే, ఈ బరువును పైకెత్తి క్రమంలో అతడి తలలోని రక్తనాళాలు తీవ్ర ఒత్తిడికి గురై పగిలిపోవడంతో స్తంభించిపోయాడు. కాసేపట్లోనే అతడి ముక్కు నుంచి రక్తం కారింది. దాదాపు అతడు చావును చూసి చివరకు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, ఇది మాత్రం తన జీవితంలో గుర్తుండిపోయే ఈవెంట్ అని చరిత్రలో లిఖించబడి ఉంటుందని కోలుకుంటున్న అతడు చెప్పాడు. లీడ్స్ అరెనాలో జరుగుతున్న అరటన్ను కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఈసారి ఎలాగైనా రికార్డు తిరగరాయాలని భావించిన ఎడ్డీ హాల్ అందులో పాల్గొన్నాడు.
గతంలో తన పేరిటే ఉన్న 465 కేజీల రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. స్టేజీపై ఉన్న అతడిని అందరు ఉత్కంఠ భరితంగా చూస్తుండగా.. గాఢ శ్వాస తీసుకొని చిట్లిపోయి రక్తం కారిపోతుందా అన్నంత ఎరుపుగా మొఖం మారగా అరటన్ను బరువు మొకాలి ఎత్తువరకు లేపాడు. ఆ వెంటనే దాన్నికిందపడేసి మొకాళ్లపై కూలబడిపోయాడు. ఎలాంటి ప్రతిస్పందన లేకుండా స్తంభించిపోయాడు. క్షణాల్లో అతడి ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. ఈవెంట్ నిర్వాకులు అతడి ముందు వాలిపోయి సహాయ చర్యలకు దిగారు.
ఈలోగా స్వయంగా అతడే మళ్లీ లేవగలిగాడు. అనంతరం అతడిని వైద్యానికి తరలించారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ..'ఆ ఈవెంట్ నన్ను దాదాపు చంపేసింది. నా శరీరంపై చెప్పలేనంత ఒత్తిడిపడింది. దాంతో దాన్ని వదిలేసి వెళ్లిపోయాను. నాకు ముక్కులో నుంచి రక్తం కూడా వచ్చింది. అయితే, ఇలా చేయడం మంచి పనికాదని నాకు అనిపించింది. కానీ, నేను ఆ పనిచేశాను.అది కచ్చితంగా చరిత్ర పుస్తకాల్లో నిలిచి ఉంటుంది. చాలా ఏళ్లపాటు ఈ రికార్డు ఉంటుంది.చంద్రుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తిలా, నాలుగు నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తిన తొలి వ్యక్తిలా అరటన్ను పైకెత్తిన తొలి వ్యక్తిని నేను ఈ అనుభూతి అద్భుతంగా ఉంది' అంటూ అతడు తన అనుభవాన్ని చెప్పాడు.