Edelweiss Asset Management
-
‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: ఎడిల్విస్ సీఈఓ
మనం చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీర్చే సాధనంగా మారుతుంది. పొదుపు చేయకపోతే జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ క్రమశిక్షణతో దాన్ని నిజంగా అనుసరిస్తూ ప్రతినెల కొంత మదుపుచేసే వారు చాలా తక్కువగా ఉంటారు. కొన్నేళ్ల కిందట ఎంతోమంది రోజువారీ సంపాదిస్తున్న కొద్దిమొత్తంలోనే ఖర్చు చేసి తోచినంత పొదుపు చేసేవారు. కానీ ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్భాటాలకుపోయి ఉన్నదంతా ఖర్చుచేసి నెలాఖరుకు చేతిలో డబ్బులేక తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ‘ఒకప్పటి తరం బతకడానికి చాలా కష్టపడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయాలు పెరిగాయి. ఇప్పటి తరానికి ఆదాయానికి కొదవ లేదు. కానీ వారిలో పొదుపు చేయాలన్న భావన కనిపించడం లేదు’అని ఎడిల్విస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌తోనే పోటీ అంటున్నారు. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థకు అధినేత ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం. బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్‌పాండే ‘ది బార్బర్షాప్ విత్ శంతను’ పేరుతో ఒక పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవల అందులో రాధికా గుప్తా మాట్లాడారు. యువతకు డబ్బు పొదుపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీలతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? ‘నెలకు రూ.50వేలు-రూ.60 వేలు సంపాదిస్తున్నవారు అందులో నెలనెలా ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా మంది సరిపడా సంపాదించలేకపోతున్నారు. సంపాదిస్తున్న దానిలో కనీసం రూ.100 క్రమానుగత పెట్టుబడిలో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నామని చాలామంది చెప్తారు. కానీ వారు నెట్‌ఫ్లిక్స్ కోసం నెలకు రూ.100 కడుతుంటారు. దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలతోపాటు స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో కేవలం 4 కోట్ల మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. ఆ 40 కోట్ల మంది నిత్యం చేస్తున్న ఖర్చులో కొంత మదుపు చేస్తే భవిష్యత్తులో వారి తర్వాతి తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే మా పోటీ’ అని రాధికా గుప్తా అన్నారు. -
ఎడెల్వీస్ నుంచి 2 టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ కొత్తగా మరో రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ ఏప్రిల్ 2037 ఇండెక్స్ ఫండ్‌తో పాటు 2027 జూన్‌లో మెచ్యూర్ అయ్యే ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ తరహా ఫండ్స్‌లో 15 ఏళ్ల సుదీర్ఘ మెచ్యూరిటీతో ఫండ్‌ను ప్రవేశపెట్టడం దేశీయంగా ఇదే ప్రథమమని సంస్థ ఎండీ రాధికా గుప్తా తెలిపారు. ఈ ఫండ్లు ప్రధానంగా భారత ప్రభుత్వ బాండ్లు (ఐజీబీ), రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) ఇన్వెస్ట్ చేస్తాయి. 2037 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 6న, 2027 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 11న ముగుస్తాయి. రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!
కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో. అర్హతలు ఉన్నప్పటికీ, పుట్టుకతో ఉన్న శారీరక సమస్యను సాకుగా చూపుతూ ఉద్యోగానికి పనికిరావని చీత్కారాలకు గురైంది. దీంతో 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ కొన్నాళ్లకు ఎడారిలో వర్షంపడినట్లుగా రాధిక జీవితంలో ఉద్యోగ అవకాశం రావడం.. దానిని అందిపుచ్చుకుని నేడు ఏకంగా ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యింది. ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక కూడా ఒకరిగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. యోగేష్, ఆర్తీ గుప్తా దంపతుల ముద్దుల కూతురు రాధికా గుప్తా. యోగేశ్ వృత్తిరీత్యా దౌత్యవేత్త కావడంతో రాధిక చిన్నతనం మొత్తం పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, ఇటలీలలో గడిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో ..‘‘బాగా చదువుకో జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతావు’’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండేవారు. దీంతో రాధిక కూడా చక్కగా చదువుకుంటూ స్కూల్లో టాప్–ఫైవ్ జాబితాలో ఉండేది. అంతా బాగానే ఉన్నప్పటికీ రాధికకు పుట్టుకతో కొన్ని సమస్యల కారణంగా మెడ వంకరగా ఉండేది. వంకర మెడతో స్కూలుకెళితే మిగతా విద్యార్థులంతా.. ఆమెను చూసి గేలి చేసేవారు. నువ్వు మీ అమ్మకంటే అందవిహీనంగా ఉన్నావు’’ అంటూ తరచూ మాటలతో హింసించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం.. వెళ్లిన ప్రతి కొత్త స్కూల్లో అవమానాలు వెన్నంటి వేధిస్తుండేవి. అయినప్పటికీ తనని తాను నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడేది . డ్యూయల్ డిగ్రీ ఉన్నప్పటికీ.. ప్రతిష్టాత్మక వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌లలో డ్యూయల్ డిగ్రీ చేసింది. రెండు డిగ్రీలు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. ఆమె విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలను పక్కనపెట్టేసి ‘నీ మెడ వంకరగా ఉంది నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేము’’ అని వెనక్కి తిప్పి పంపేవారు. ఇలా వరుసగా ఏడుసార్లు జరగడంతో రాధిక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటే ఏబాధ ఉండదు అనిపించింది ఆమెకు. కౌన్సిలింగ్‌తో... నిరాశనుంచి బయటపడేందుకు కొంతమంది స్నేహితుల సాయంతో సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంది. ఆ తరువాత మెకిన్సేలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా చేరింది. తరువాత తన భర్తతో కలిసి ఇండియా వచ్చింది. సొంతంగా ‘ఫోర్‌ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్’ కంపెనీని ప్రారంభించింది. కంపెనీ క్యాపిటల్, పనితీరు బావుండడంతో ఎడిల్వీజ్ ఫోర్ఫ్రంట్ను కొనేసింది. ఇదే సమయంలో రాధిక పనితీరుని మెచ్చి ఎడిల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు సీఈవోని చేసింది. అనేక అవమానాలు, కష్టాల తరువాత సీఈవోగా రాణిస్తోన్న రాధిక ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘దట్ గర్ల్ విత్ ఏ బ్రోకెన్ నెక్’ వీడియోలో తన కథను వివరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవమానాలనుంచి అందనంత ఎత్తుకు ఎదిగి నేను ఇది అని నిరూపించి చూపిస్తోంది రాధిక. నాన్నే ప్రేరణ.. నాన్న ..ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. నిరుపేదరికం నుంచి వచ్చిన ఆయన అన్నిసాధించ గలిగినప్పుడు, నాకున్న ఒక సమస్యతో ఎందుకు వెనుకబడిపోవాలి అనుకుని, బాగా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. అందం, అనుమానాలను పక్కనపెట్టి, నేను ఎదుర్కొన్న ప్రతిసమస్యను అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగాను. దాంతోనే ఈ స్థాయిలో నిలబడిగలిగాను. – రాధికా గుప్తా -
రెలిగేర్ సెక్యూరిటీస్‌ను కొనేసిన ఎడిల్వీస్
సాక్షి, ముంబై: ఎడిల్ వీస్ వెల్త్ మేనేజ్మెంట్ రెలిగేర్ సెక్యూరిటీస్ బిజినెస్‌ను కొనుగోలు చేసింది. డిపాజిటరీ పార్టిసిపెంటరీ సర్వీసెస్ సహా సెక్యూరిటీస్, కమోడిటీ బ్రోకింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్టు ఎడిల్వీస్ బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌తో రెలిగేర్‌కు చెందిన సెక్యూరిటీ బిజినెస్‌లో భాగంగా కమోడిటీస్ బ్రోకింగ్, డిపాజిటరీ పార్టిసిపెంట్ సర్వీసులను సైతం ఎడిల్వీస్ దక్కించుకోనుంది. ఈ డీల్ ద్వారా తమ గ్రోత్ ప్లాన్స్ మరింత ఆకర్షణీయంగా మారనున్నాయని ఎడిల్వీస్ గ్రూప్ గ్లోబల్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, సీఈవో నితిన్ జైన్ చెప్పారు. తమ క్లయింట్ బేస్ దాదాపు మూడు రెట్లు పెరుగుదలకు సహాయం చేస్తుందన్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కొనుగోలు విషయాన్ని వెల్లడించడంతో ఈ రెండు కౌంటర్లూ వెలుగులోకి వచ్చాయి. బీఎస్ఈలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ షేరు 5 శాతం లాభపడగా, ఎడిల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.27 శాతం లాభాలతో కొనసాగుతోంది. కాగా గతంలో ఎడెల్ వీస్ వెల్త్ మేనేజ్మెంట్ రూష్నిల్ సెక్యూరిటీస్ (2001) , అనాగ్రాం క్యాపిటల్ లిమిటెడ్ (2010) ను కొనుగోలు చేసింది. -
ఎడెల్వీజ్ చేతికి జేపీ మోర్గాన్ ‘ఫండ్’
డీల్ విలువ రూ. 110 కోట్లు! న్యూఢిల్లీ: ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌కు భారత్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఎడెల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ మంగళవారం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 110 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఫండ్ దాదాపు రూ. 7,000 కోట్ల పైచిలుకు అసెట్స్‌ను నిర్వహిస్తోంది. డీల్ అనంతరం ఏర్పడే సంయుక్త సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రూ. 8,757 కోట్ల అసెట్స్ ఉంటాయి. జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియాకి సంబంధించిన మెజారిటీ ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఎడెల్వీజ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి గత కొన్నాళ్లుగా పలు అంతర్జాతీయ సంస్థలు వైదొలుగుతున్నాయి. ఈ కోవలో జేపీ మోర్గాన్ 11వది. రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ గతేడాది గోల్డ్‌మన్ శాక్స్ భారత ఫండ్ వ్యాపారాన్ని రూ. 243 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాండర్డ్ చార్టర్డ్ తన ఫండ్ వ్యాపారాన్ని 2008లో ఐడీఎఫ్సీకి విక్రయించింది.