వీడిన మిస్టరీ.. భర్తే హంతకుడు
ఈడూరు (అత్తిలి): అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన పెన్మెత్స పావని హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే భార్యను చంపి ఆత్మహత్యగా నమ్మించాడు. మృతురాలు బంధువులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన వేగేశ్న శ్రీనివాసరాజు కుమార్తె పావని (22)కి, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన పెన్మెత్స సూర్యనారాయణరాజు కుమారుడు సుబ్రహ్మణ్య కుమార్‌రాజుతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహమయ్యింది. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వారితో పాటు సుబ్రహ్మణ్యకుమార్ తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఈనెల 24న పావని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు భర్త దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు నమోదు చేశారు.
అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని స్వగ్రామమైన ఈడూరుకు బుధవారం అర్ధరాత్రి తీసుకువచ్చారు. భార్య మృతదేహాన్ని చూడటానికి వచ్చిన భర్తను మృతురాలి కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు. భార్యతో గొడవపడి, ఆవేశంలో కొట్టడంతో చనిపోయిందని వివరించాడు. ఇదే విషయాన్ని అతడు మీడియాకూ తెలిపాడు. ఈ ఘటనను ఆత్మహత్యగా మలిచేందుకు తానే ఫ్యాన్‌కు ఉరివేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు అత్తిలి పోలీసులు సమాచారాన్ని అందజేశారు. అయితే ఇరుకుటుంబాల మధ్య పెద్దలు రాజీకుదిర్చినట్టు తెలిసింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.