యూపీలో కూలిన ఐఏఎఫ్ చాపర్
ఏడుగురు మృతి
న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు సహా ఏడుగురు వైమానిక దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి అలహాబాద్ వస్తున్న ‘ఏఎల్‌హెచ్ ధ్రువ్’ చాపర్ సీతాపూర్ జిల్లాలోని పాలిత్పుర్వ గ్రామం దగ్గర్లోని పంట పొలాల్లో కూలిపోయింది. ప్రమాదానికి ముందు పైలట్ ‘మేడే కాల్(ఎమర్జెన్సీ కాల్)’ చేశారని, అనంతరం రేడియో, రాడార్ సంకేతాలకు చాపర్ దూరమైందని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
బరేలీలో మధ్యాహ్నం 3.53 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్ దాదాపు గంట తరువాత ప్రమాదానికి గురైందని ఆయన వివరించారు. ఆ చాపర్‌లో ఇద్దరు పైలట్లు, వివిధ హోదాల్లో ఉన్న ఐదుగురు వైమానికదళ సైనికులు ఉన్నారన్నారు. సమాచారం తెలియగానే సహాయక బృందాలు ఘటనాస్థలికి బయల్దేరాయన్నారు. ప్రమాదంపై అంతర్గత దర్యాప్తునకు ఐఏఎఫ్ ఆదేశించిందని ఆయన తెలిపారు. కూలిపోగానే చాపర్ మంటల్లో చిక్కుకుందని సిధౌలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు.