దేశాన్ని రక్షించే శక్తి ఆర్ఎస్ఎస్కే ఉంది
జోగిపేట: దేశాన్ని రక్షించే శక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు మాత్రమే ఉందని తెలంగాణ ప్రాంత కార్యవాహక్ ఎక్కా చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం జోగిపేటలోని హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రాథమిక శిక్షావర్గ సార్వజనికోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడుతూ దేశం కోసం పనిచేయడం ప్రతి ఒక్కరి బాధ్యతఅన్నారు.
18 -35 సంవత్సరాల వారు 40 కోట్ల మంది దేశంలో ఉన్నారన్నారు. యువతలో స్వార్థపూరితమైన ఆశలు రెకెత్తించేది రాజకీయ నాయకులేనన్నారు. ఆర్ఎస్ఎస్ అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ కాదని, ఓపెన్ ఆర్గనైజేషన్ అన్నారు. వ్యక్తిత్వ వికాసం, నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుందని స్వామి వివేకానంద పేర్కొన్నారన్నారు. రాజకీయ నాయకులు 15, 10 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేయలేరని, ఆర్ఎస్ఎస్లో మాత్రం 50 సంవత్సరాలకు పైగా విశ్వాసంగా పనిచేసే వారున్నారన్నారు. జోగిపేట నగర పంచాయతీ చైర్ పర్సన్ ఎస్.కవిత మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దేశ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం గర్వించదగ్గ విషయమన్నారు.
నాదులాపూర్ సదానంద ఆశ్రమ పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ సమాజాన్ని గౌరవించడం నేర్చుకోవాలని, వారితో పాటు తల్లిదండ్రులను గౌరవిస్తేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఖండ సంఘ చాలక్ తీర్థాల సుబ్రహ్మణ్య స్వామి, జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ పట్లోల్ల సురేందర్‌రెడ్డి, జిల్లా సంఘ చాలక్ రామకృష్ణ, విభాగ్ వ్యవస్థ ప్రముఖ్ నర్సింగ్‌రావు కులకర్ణి, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ మురళీధర్‌రెడ్డి, జిల్లా సహ వ్యవస్థాపక్ ప్రముఖ్ చంద్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, జేఏసీ చెర్మైన్ ఏ.మాణయ్య పాల్గొన్నారు.
దేశం కోసం పనిచేయాలి
రామాయంపేట: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు దేశం కోసం పనిచేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఆర్ఎస్ఎస్ ఇన్చార్జి ఆయాచితుల లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం రామాయంపేటలో జరిగిన సంఘ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశానికి స్వాతంత్య్రం కాదు అస్తత్వం అవసరమన్నారు. ప్రజలను ఏకతాటిపై నడిపించేందుకు 1925 నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైందన్నారు.
దేశం కోసం పని చేసేందుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారన్నారు. సమావేశంలో నవజ్యోతి స్వచ్ఛంద సంస్థ చెర్మైన్ మనోహర్‌రావు, విశ్రాంత ఉపాధ్యాయుడు దేమె భూమయ్య,సంఘం ప్రతినిధి సూర్యనారాయణ తదితరులు మాట్లాడారు. అంతకు ముందు రామాయంపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ పట్టణంలోని వీధులగుండా కొనసాగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రఘునందన్‌రావు, సిద్దరాంలు, సంతోష్, రఘుపతిగౌడ్, ఆర్ఎస్ఎస్ నేతలు పాల్గొన్నారు.