స్విమ్మింగ్పూల్లోని నీటితో అలర్జీ... అధిగమించడం ఎలా?
నా వయసు 48. ఈ వయసులోనే నాకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి. అందుకే వ్యాయామం కోసం ఈతను ఎంచుకుని, స్విమ్మింగ్పూల్కు వెళ్లడం మొదలుపెట్టాను. అయితే స్విమ్మింగ్పూల్లో దిగగానే చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. డాక్టర్ను కలిస్తే అలర్జీ అని చెప్పారు. పైగా చెవుల్లో నీళ్లు పోవడం వల్ల తలనొప్పి కూడా వస్తోంది. అయితే మోకాళ్ల నొప్పుల కారణంగా నేను ఎలాగూ వాకింగ్, జాగింగ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి, పై సమస్యలను అధిగమించి నా వ్యాయామంగా ఈతనే కొనసాగించడం ఎలా?
- వెంకట్, హైదరాబాద్
ఏరోబిక్ ఎక్సర్సెజైస్లో ఈత ఒక మంచి వ్యాయామం. కొద్దిపాటి జాగ్రత్తలతో స్విమ్మింగ్ చేస్తే ఫిట్నెస్ పెంచుకోడానికి, శరీరంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోడానికి ఈత చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈతకొలనులో దిగినప్పుడు అలర్జీ రావడం చాలా మందిలో చాలా సాధారణంగా కనిపించే అంశమే.
ఇందుకు చాలా అంశాలు దోహదం చేసినా, అన్నిటికంటే ముఖ్యమైనది ఈతకొలనులో కలిసే క్లోరిన్. దీన్ని క్రిమిసంహారిణిగా వాడుతుంటారు. ఇది కొందరి చర్మంపై దుష్ర్పభావం చూపేందుకు అవకాశం ఉంది. ఫలితంగా కొందరిలో వీటి వల్ల బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు సైతం తలెత్తే అవకాశం ఉంది. ఇక కొందరిలో సూర్యరశ్మి నేరుగా తగిలేలా ఈదడం వల్ల సూర్యకిరణాల్లోని అల్ట్రావయొలెట్ తరంగాల కారణంగా చర్మంపై దద్దుర్లు రావచ్చు. ఇంకా... మీరు చెప్పినట్లుగానే మరికొంతమందిలో ఈత వల్ల సైనసైటిస్, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే స్విమ్మింగ్ చేసేప్పుడు ఈ కింద పేర్కొన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవి...
స్విమ్మింగ్ పూల్లోకి దిగడానికి ముందు, స్విమ్మింగ్ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయండి.
తలకు క్యాప్ పెట్టుకోవడం, చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం తప్పనిసరి.
ఈతకొలను నీటిలో క్లోరిన్ కలిపే సమయంలో సరైన పాళ్లలో నిర్ణీత మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
నేరుగా సూర్యకాంతి తగలకుండా ఈదాలి.
ఈతను ఒక వ్యాయాయంగా కొనసాగిస్తూ దానితో పాటు పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ, మంచి పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) కూడా పాటిస్తే మంచి ఫిట్నెస్ కూడా సాధ్యమవుతుంది.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్