గ్రూప్-2 పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలో డిసెంబర్ 1న నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీపంలో జెరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలు, సెల్‌ఫోన్ విక్రయ కేంద్రాలకు నోటీసులు జారి చేసి పరీక్ష రోజున మూసి వేసేలా చూడాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లకుండా నిషేధించాలని తెలిపారు. అభ్యర్థులను నిర్ణీత సమయం కంటే ముందుగా పంపవద్దన్నారు.