డాక్టర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి
వైద్యురాలితో బంధువుల ఘర్షణ
ఘటనపై డీవైసీఎంకు ఫిర్యాదు
ఇల్లెందు అర్బన్: సింగరేణి వైద్యశాలలో పనిచేస్తున్న ఓ డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కారేపల్లి మండలం ఆల్యతండాకు చెందిన సోని (76) శనివారం ఉబ్బసంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వైద్యం కోసం ఇల్లెందు ఏరియా సింగరేణి వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్ సుధారాణి సోని ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆయాసం ఎక్కవైతే వెంటనే వైద్యశాలకు తీసుకురావాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే ఉబ్బసం ఎక్కువ కావడంతో వెంటనే వైద్యశాలకు తీసుకొస్తుండగా ఆస్పత్రి ఎదుటే మృతి చెందింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు వైద్యురాలి నిర్లక్ష్యం వల్లనే సోని మృతి చెందిందని డాక్టర్తో ఘర్షణకు దిగారు. ఇంటికి పంపించకుండా ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకుని ఉంటే తమ తల్లి చనిపోయేది కాదని మృతిరాలి కుమారుడు మంజ్యా ఆరోపించారు. ఈ మేరకు డీవైసీఎంఓ నెరెల్లాకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న ఏరియా ఇన్చార్జి డీజీఎం (పర్సనల్) లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ నేత కె.సారయ్య వైద్యశాలకు వచ్చి మృతిరాలి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఘటనకు గల కారణాలను వైద్యాధికారి నెరెల్లాను అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్ వివరణ
‘సోని ఆరోగ్యం మెరుగుపడటంతో వారి కుటుంబసభ్యుల అంగీకారం మేరకే ఇంటికి పంపించాం. ఉబ్బసం ఎక్కువైతే వెంటనే వైద్యశాలకు తీసుకురావాల్సిందిగా సూచించాను. వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోలేదు.’