తరగతి గదిలో కుప్పకూలిన విద్యార్థి
గుమ్మఘట్ట, న్యూస్‌లైన్ : గుమ్మఘట్ట మండలం గోనబావి ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో ఓ విద్యార్థి ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రధానోపాధ్యాయురాలు అంజని ప్రభావతి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గోనబావికి చెందిన ఉప్పర చిన్న తిమ్మప్ప కుమారుడు నగేష్ (12) ప్రాథమిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం ప్రార్థన సమావేశం ముగిసిన తర్వాత తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతుండగా ఉన్నట్లుండి సృ్పహతప్పి కిందపడిపోయాడు. వెంటనే ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించిన తర్వాత రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే ప్రాణం విడిచాడు. లో బీపీ, గుండెపోటు వల్ల మృతి చెంది ఉంటాడని వైద్యుడు డాక్టర్ పి.సత్యనారాయణ తెలిపారు. విషయం తెలియగానే ఎంఈఓ గౌరీశంకర్ గ్రామానికి చేరుకుని.. విద్యారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. బాగా చదివే విద్యార్థి ఆకస్మిక మరణం జీర్ణించుకోలేకపోతున్నామని ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు కంటతడి పెట్టారు. విద్యార్థి మృతికి సంతాప సూచకంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. కుమారుడు మృతి చెందాడని తెలుసుకుని.. ఉపాధి హామీ పనికి వెళ్లిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ‘అమ్మా, నాన్న.. మీరు పని నుంచి వచ్చేలోపే ఇంటికి వస్తానంటివి కదయ్యా’ అంటూ తల్లి శివలక్ష్మి విలపించిన తీరు చూపరులను కలచివేసింది.