జంబోల కోసం అంబులెన్సులు
తిరువనంతపురం: మనం అనారోగ్యం వల్లో, ప్రమాదం వల్లో విషమపరిస్థితిలో ఉంటే.. వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సులు ఉంటాయి. మరి అడవిలో ఉండే గజరాజులు పరిస్థితి ఏమిటి? విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు వాటిని వైద్యశాలలకు తరలించడం ఎలా?.. ఇదే అంశాన్ని కేరళ ప్రభుత్వం కూడా ఆలోచించి ఉంటుంది. అందుకే ఏనుగుల కోసం కూడా లగ్జరీ అంబులెన్స్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నది.
ఉత్తర కేరళలోని వాయానంద్ అడవి జంతువుల పరిరక్షణ కేంద్రం (డబ్ల్యూడబ్ల్యూఎస్)లో పెద్దసంఖ్యలో ఉన్న ఏనుగుల కోసం అటవీశాఖ యానిమల్ అంబులెన్స్‌లను త్వరలో ప్రారంభించనుంది. ఏనుగులను తరలించేందుకు వీలుగా లారీలకు పలుమార్పులు చేసి ఈ అంబులెన్స్‌లను రూపొందిస్తున్నారు. గాయపడ్డ ఏనుగులను అత్యవసరంగా తరలించడం, శాంతించిన ఏనుగులను తిరిగి వాటి నివాస ప్రాంతాలకు తరలించడం కోసం ఈ అంబులెన్సులను ప్రధానంగా వాడునున్నారు. స్థానిక ఏనుగులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్లేందుకు కూడా వీటిని ఉపయోగిస్తారు.
జంబో ఫ్రెండ్లీ!
భారీ కాయంతో ఉండే గజరాజులను తరలించేందుకు అన్ని అనుకూలమైన ఏర్పాట్లు, తగినన్ని సౌకర్యాలు ఈ యానిమల్ అంబులెన్సులు ఉంటాయి. ఇందులో ఏనుగులను వాహనాల్లోకి ఎక్కించేందుకు అవసరమైన తాళ్లు, క్రేన్లు ఉంటాయని, ప్రయాణ సమయంలో ఏనుగులు ప్రశాంతంగా ఉండేందుకు వీలుగా చల్లని వాతావరణం, తాగునీరు అందుబాటులో ఉంటాయని, దీనివల్ల ఏనుగుల తరలించే సమయంలో వాటితో మావటిలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని డబ్ల్యూడబ్ల్యూఎస్ వార్డెన్ డీ ధనేష్కుమార్ తెలిపారు. ఈ వాహనాల్లో ఏనుగులు కదలకుండా ఉండేందుకు ఏర్పాట్లు ఉంటాయని, వాటికి అవసరమైన ఆహారం, ఔషధాలు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.