భూలోక ఇంద్రజాలం!
ఇంద్రలోకాన్ని ఇంగ్లిష్‌లో ‘ఎలీజియం’ అంటారు. ఇంద్రలోకం అంటే స్వర్గలోకం. అక్కడ దేవేంద్రుడు ఉంటాడు. ఉండడమేంటి? ఆయనే కింగ్. ఆయన వెహికల్ ఐరావతం. టూ కాస్ట్లీ! తెల్ల ఏనుగు కదా! ఆ మాత్రం ఉంటుందనుకోవచ్చు. ఇక రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ.. మీకు తెలియందేముందీ.. వీళ్లంతా ఇంద్రుడి కొలువులోని అప్సరసలు! పని మీద అక్కడికి వెళ్లినవారు కాసేపు సుఖాసీనులై అప్సరసల డ్యాన్స్ చూసి సంతృప్తి నిండిన మనసుతో సెలవు తీసుకోవచ్చు. అయితే ఆ సంతృప్తి.. అప్సరసల నాట్యాన్ని తిలకించడం వల్ల కలిగిందా లేక, వాళ్లు కూర్చున్న కుర్చీ వల్ల కలిగిందా చెప్పడం కష్టం! ఎందుకంటే ఇంద్రలోకంలో ఫర్నిచర్ కూడా దేవతల లెవల్‌కు తగినట్టే ఉంటుంది.
ఆ లెవల్‌కు ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు భూలోకంలో కూడా అలాంటి కుర్చీనే ఒకటి మానవులకు అందుబాటులోకి వచ్చింది! దాని పేరు ‘ఎలీజియం’! డాక్టర్ డేవిడ్ వికెట్ అనే బ్రిటిష్ బయోఇంజనీర్ ఈ కుర్చీని సృష్టించారు. కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారైన ఎలీజియంలో కూర్చుంటే గాలిలో తేలినట్టే ఉంటుంది. మన బరువు మనకు తెలీదు. జీరో గ్రావిటీ (వెయిట్‌లెస్‌నెస్) అన్నమాట. ఎలక్ట్రానిక్ జాయింట్లు, బేరింగులతో దీనిని జీరో గ్రావిటీ చెయిర్‌గా నిర్మించారు డాక్టర్ వికెట్. ఇందుకోసం ఆయన పదేళ్లు శ్రమించారు. కూర్చున్నా, పడుకున్నా ఒళ్లు తేలిపోయినట్టుండడం ఎలీజియం ప్రత్యేకత. వెన్నుభాగంలో ఒత్తిడిని కలిగించని విధంగా భంగిమను, గురుత్వాకర్షణను సమన్వయం చేస్తూ ‘ఫ్రిక్షన్‌లెస్ టెక్నాలజీ’తో ఈ అద్భుతాన్ని సాధించారట డేవిడ్ వికెట్.
ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మోటార్లు, కేబుళ్లు, స్ప్రింగ్ మెకానిజాలు లేకుండా కేవలం మేథమెటిక్స్‌తో తయారైన ఇంటెలిజెంట్ డిజైన్ ఇది! పూర్తిగా హ్యాండ్‌మేడ్ అయిన ఈ కుర్చీ కేంబ్రిడ్జిలోని ఒక వర్క్‌షాపులో తయారైంది. స్కాండినేవియన్ లెదర్ కవర్‌తో చూడ ముచ్చటగా కనిపించే ఈ ‘ఎలీజియం’ ధర 26,000 డాలర్లు. మన రూపాయల్లో సుమారు లక్షా 73 వేల 400. ఈ మోడల్ కుర్చీలు ఇప్పటి వరకు ఎన్ని అమ్ముడుపోయాయో తెలియదు కానీ, ప్రస్తుతానికి 20 మాత్రమే అమ్మకానికి ఉన్నాయట! కావలసినవారు నైట్స్‌బ్రిడ్జ్ (ఇంగ్లండ్)లోని బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ షోరూమ్‌కి వెళ్లొచ్చు. ఆఫీసులకైతే ముందుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాలట. ఇంత సుఖాన్నిచ్చే కుర్చీలను ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తే ఏమైనా ఉందా? సిబ్బంది అంతా సింగిల్ సిట్టింగ్‌లో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోరూ!