హాస్యమే సేఫ్
ఇక్కడ హాస్య కథా చిత్రాలే సేఫ్ అనే నమ్మకం వ్యక్తం అవుతోందంటున్నారు ప్రముఖ దర్శకుడు ఎళిల్. ఇంతకు ముందు విజయ్ హీరోగా తుళ్లాద మనం తుళ్లుమ్, అజిత్‌తో రాజా చిత్రాలతో పాటు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన నటుడు విష్ణువిశాల్ నిర్మాతగా కూడా అవతారమెత్తడం విశేషం. ఆయన సరసన నిక్కీగల్రాణి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.కే.సత్య సంగీతాన్ని అందించిన వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రం రేపు (శుక్రవారం)తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎళిల్‌తో చిన్న భేటీ.
ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ టైటిలే కొత్తగా ఉందే?
జ: ఇది నా గత చిత్రాల కంటే కామెడీ బాగా వ ర్కౌట్ అయిన చిత్రం. పని అంటూ వస్తే అతను ఇంగ్లిషోడు లాంటి వాడని (వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్) గ్రామాల్లో నానుడి ఉంది. ఈ చిత్రం లో హీరో ఏ పని సరిగా చేయడు. అందుకే కాం ట్రాస్ట్గా ఉంటుందని ఆ పేరు నిర్ణయించాం.
ప్ర: సరే చిత్ర కథేంటి?
జ: ఏ పనీ సరిగా చేయని విష్ణువిశాల్, పోలీస్ అధికారిణి నిక్కీగల్రాణి, రవి మరియలకు సూరి ఒక సమస్యను తెచ్చి పెడతాడు. చివరికి ఆ సమస్యను తనే ఎలా పరిష్కరించారన్న వినోదాల విందే వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రం.
ప్ర: ఈ చిత్రానికి నటుడు విష్ణువిశాల్ నిర్మాతగా మారడానికి ప్రధాన కారణం?
జ: నిజానికి ఈ చిత్రాన్ని మొదట వేరే నిర్మాత నిర్మించాల్సింది. కొన్ని ఆటంకాల వల్ల ఆయన చేయలేని పరిస్థితి ఏర్పడడంతో వేరే నిర్మాతతో చర్చలు జరుగుతుండగా కథ బాగుందని తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని విష్ణువిశాల్ ముందుకు వచ్చారు. నటుడిగానూ ఈ చిత్రం ఆయనకు వేరేలా ఉంటుంది.
ప్ర: కథానాయకుడే నిర్మాత అవడంలో ఇబ్బంది అనిపించలేదా?
జ: ఇందులో ఇబ్బందే ముంటుంది. చెప్పిన బ డ్జెట్లో చిత్రాన్ని పూర్తి చేసి ఇస్తే సమస్యలే ఉం డవు. నా గత చిత్రాలకు కొన్ని రీషూట్స్ చేశా ను. నిర్ణయించిన బడ్జెట్లో కరెక్ట్ టైమ్‌లో పూర్తి చేసి ఇచ్చాను. కారణం షూటింగ్‌కు ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే.
ప్ర: చిత్రంలో సూరి పాత్ర గురించి?
జ: నాకు సూరికి మధ్య మంచి అండర్స్టాం డింగ్ ఉంది. మనం కొత్తి పరవై చిత్రంలో ఆయనకు చిన్న పాత్రనే ఇచ్చాను. అయితే ఒక ముఖ్య పాత్ర పోషించాల్సిన నటుడు రాకపోడంతో అతని పాత్రను సూరి ఎలా చేస్తారో చూద్దాం అని ఆయనతో చేయిం చాను. ఇక ఈ చిత్రంలో అంతకంటే బాగా హాస్యాన్ని పండించారు.ఇప్పటి వరకూ ఆయన్ని పరోటా సూరి అని పిలుస్తున్న వారు ఈ చిత్రం విడుదలైన తరువాత పుష్పా పురుషుడు సూరి అని పిలుస్తారు.
ప్ర: వరుసగా హాస్యకథా చిత్రాలనే చేస్తున్నారే?
జ: వేరే జానర్ కథా చిత్రాల ను చేయాలని నేనూ కోరుకుంటున్నాను.అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. హాస్య భరిత కథా చిత్రాలే సేఫ్ అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. భారీ చిత్రం చేయాలంటే ప్రముఖ కథానాయకుల కాల్షీట్స్ అవసరం అవుతుంది. నా తదుపరి చిత్రం ప్రముఖ హీరోతోనే ఉంటుంది.