పబ్లిక్ ఇష్యూల హవా
న్యూఢిల్లీ: ఈ వారం ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంది. బుధవారం(14న) ముగిసిన శూల వైన్యార్డ్స్కు 2.33 రెట్లు అధిక స్పందన లభించగా.. గురువారం(15న) ముగిసిన మరో రెండు ఐపీవోలు విజయవంతమయ్యాయి. ఇవి ల్యాండ్మా ర్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్‌కాగా.. సోమ (21), మంగళ(22)వారాల్లో మరో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఈ ప్రభావంతో హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండెజీన్ లిమిటెడ్ తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇతర వివరాలు చూద్దాం..
ల్యాండ్‌మార్క్ కార్స్
చివరి రోజుకల్లా ప్రీమియం ఆటోమొబైల్ డీలర్ షిప్ కంపెనీ ల్యాండ్‌మార్క్ కార్స్ ఐపీవోకు 3 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 80,41, 805 షేర్లు ఆఫర్ చేయగా.. 2.46 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 8.71 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.32 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 59 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 481–506 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 552 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
అబాన్స్ హోల్డింగ్స్
ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ అబాన్స్ హోల్డింగ్స్ ఐపీవోకు చివరి రోజుకల్లా కేవలం 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 1,28,00,000 షేర్లు ఆఫర్ చేయగా.. 1.40 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 4.1 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.48 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 40 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 256–270కాగా.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ అబాన్స్ ఫైనాన్స్ పెట్టుబడులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఎలిన్ ధర ఖరారు
ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 234–247 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 20–22 మధ్య చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తొలుత రూ. 760 కోట్లపై కన్నేసినప్పటికీ టార్గెట్‌లో కోత పెట్టుకుంది. వెరసి ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, యూపీ, గోవా యూనిట్ల విస్తరణ, ఆధునీకరణసహా ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్, తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఫ్రాక్షనల్ హెచ్‌పీ మోటార్స్ తయారీలో పేరొందింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) ఆదాయం 27 శాతం జంప్‌చేసి రూ. 1,094 కోట్లకు చేరగా.. నికర లాభం 12 శాతం మెరుగుపడి రూ. 39 కోట్లను తాకింది.
ఇండెజీన్ లిమిటెడ్
హెల్త్‌కేర్ టెక్ కంపెనీ ఇండెజీన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమపై దృష్టి పెట్టిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 3,200 కోట్లు సమీకరించాలని చూస్తోంది. దీనిలో భాగంగా రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 3.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
సోమవారం కేఫిన్..
19న ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది.