అవగాహన రాహిత్యంతోనే ముంపు
రామగుండం: ఉమ్మడి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి నిల్వలపై అవగాహన రాహిత్యంతోనే బ్యాక్‌వాటర్‌లో అధికారులు పేర్కొన్న వాటికంటే ఎక్కువ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని పొట్యాలలో రూ.60 లక్షలతో మర్రిపల్లి–పొట్యాల వరకు డబుల్‌రోడ్డు, రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ను ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రసుత్తం ప్రాజెక్టు నీటి సామర్థ్యం కంటే తక్కువగానే వరద నీరు నిలిచినా కుక్కలగూడూర్ వరదతో ముంచెత్తుతుందన్నారు. మరో రెండు మీటర్ల ఎత్తు పెరిగితే మరింత ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ మూడు గ్రామాలకు ఒక్క కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు.
అంతర్గాం మత్స్య పరిశ్రమకు అనుకూలం
– ఆర్టీసీ చైర్మన్
రివర్స్ పంపింగ్ విధానంతో నిర్మించే మేడిగడ్డ ప్రాజెక్టుతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో గోదావరినది తీరప్రాంతం నిత్యం వరద నీటితో ఉంటుందన్నారు. గోదావరి తీరప్రాంతమైన అంతర్గాంలోని ప్రభుత్వ స్థలాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐలకు అనుబంధంగా మినీ పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ మస్కం శ్రీనివాస్, ఎంపీపీ ఆడెపు రాజేశం, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీటీసీ లగిశెట్టి సునీత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.