ellareddypeta
-
పొలం వద్ద గుడారంలో తల్లితోపాటు మూడురోజులు పాటు..
-
కామాంధుల చేత చిక్కి.. కరోనా సోకి బిక్కుబిక్కు
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆమె కామాంధుల బాధితురాలన్న కనికరంలేదు.. ఆమెకు కరోనా సోకిందన్న దయ లేదు.. ఆమెను తండావాసులు నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. చుట్టూ కారుచీకటి.. చుట్టుపక్కల కానరాని మనిషి జాడ.. ఎటువైపు నుంచి ఏ అడవి జంతువు వచ్చి దాడి చేస్తుందోనన్న భయం.. మరోవైపు వర్షం.. రక్షణ ఇవ్వలేని గుడారం.. ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో మూడురోజులపాటు కొట్టుమిట్టాడింది ఓ అభాగ్యురాలు. ఈ హృదయ విదారకమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో చోటుచేసుకుంది. వివరాలు... రాశిగుట్ట తండాకు చెందిన ఓ బాలిక గతనెల 18న లైంగికదాడికి గురైంది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, నిందితులను అదే నెల 20న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిరిసిల్లలోని సఖీ కేంద్రంలో బాలికకు వసతి కల్పించారు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అదేరోజు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అప్పటికే తల్లికి కూడా కరోనా సోకింది. ఐసోలేషన్ కేంద్రంలో పట్టించుకునేవారు లేకపోవడంతో తల్లీకూతుళ్లు తండాకు చేరుకున్నారు. అప్పటికే సగం సచ్చి బతుకుతున్న ఆ కుటుంబంపట్ల సానుభూతి చూపకపోగా, తమకు కరోనా వస్తుందనే కారణంతో తండావాసులు వారిని వెలివేశారు. దీంతో ఊరుకు దూరంగా వారి సొంతపొలం వద్ద గుడారం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో స్పందించిన జిల్లా అధికారులు వెంటనే తండాకు చేరుకుని తల్లీకూతుళ్లను మళ్లీ సిరిసిల్లలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. చదవండి: మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్ -
అప్పుల బాధతో కౌలు రైతు మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన సల్వాల నాంపెల్లి(45) అనే కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపెల్లి గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పుతో పాటు చిన్న కొడుకు నరేశ్‌ను రూ.లక్ష అప్పు చేసి గల్ఫ్‌కు పంపాడు. గల్ఫ్‌లో సరైన పనులు లేక కొడుకు ఇంటికి డబ్బులు పంపలేకపోయాడు. దీనికితోడు కుటుంబ పోషణ భారంగా మారడంతో పూట గడవడం కోసం మరిన్ని అప్పులు చేశాడు. ఎకరం పొలం కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేశాడు. రెండేళ్లుగా పంట దిగుబడి రాక నిరాశే ఎదురైంది. ఫలితంగా రూ.3లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. దీంతో మనస్తాపం చెందిన నాంపెల్లి సోమవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. -
గిరిజన యువకులపై కానిస్టేబుళ్ల ప్రతాపం
ఒకరి పరిస్థితి విషమం.. పోలీసులకు ఫిర్యాదు ఎల్లారెడ్డిపేట : సారా పట్టివేత పేరుతో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు మితి మీరి ప్రవర్తిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఇద్దరు గిరిజన యువకులపై కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. ఇందులో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. బాధితులు, కుటుంబ సభ్యుల కథనం... ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం తండాకు చెందిన భూక్య నర్సింలు(22) ఆయన మిత్రుడు లకావత్ మణిరాం ద్విచక్ర వాహనంపై గురువారం తెల్లవారుజామున కరీంనగర్ ఆసుపత్రికి బయలుదేరారు. ఎల్లారెడ్డిపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాటు వేసి ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు శ్రావణ్, ప్రశాంత్‌రెడ్డిలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నర్సింలు, మణిరాంలను ఆపారు. వాహనంలో సారాను తరలిస్తున్నారా అని ఆరాతీశారు. తాము కరీంనగర్ వెళ్తున్నామని ఎంత చెప్పిన వినని కానిస్టేబుళ్లు కర్రలతో దాడిచేశారు. ఈ సంఘటనలో నర్సింలు కంటికింది భాగంలో ఎముకలు విరిగాయి. మణిరాం స్వల్పంగా గాయపడ్డాడు. నర్సింలు సృహతప్పి పడిపోవడంతో ఆందోళన చెందిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మణిరాం గ్రామస్తులకు సమాచారం అందించడంతో గాయపడ్డ నర్సింలును మొదట సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింలు వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నాడు. బతకడం కష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లి నర్సింలు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడి సంఘటనపై నర్సింలు తండ్రి లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై రమేశ్ తెలిపారు.